నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, సైబర్ సేఫ్టీలో కీలకపాత్ర
సీఎం రేవంత్‌తో గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ భేటీ
‘జీఎస్‌ఈసీ’ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
హైదరాబాద్ ఐటీ, ఇన్నోవేషన్ హబ్ అవుతుందన్న సీఎం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదటి ‘గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (జీఎస్‌ఈసీ)’ హైదరాబాద్‌లో ఏర్పాటుకానుంది. ఈ మేరకు గూగుల్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న ఈ ‘గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్’మొత్తంగా ఐదోదికాగా.. ఆసియా పసిఫిక్ జోన్‌లో టోక్యో తర్వాత ఇదే రెండో సెంటర్ కావడం గమనార్హం.
గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో భేటీ అయింది. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు.
అమెరికా పర్యటనలో సంప్రదింపుల నేపథ్యంలో..
ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం రేవంత్.. సంస్థ ప్రతినిధులతో జరిపిన సంప్రదింపుల నేపథ్యంలో జీఎస్‌ఈసీ ఏర్పాటుకు ముందుకొచ్చిందని సీఎం కార్యాలయం వెల్లడించింది.
అక్టోబర్ 3న జరిగిన ‘గూగుల్ ఫర్ ఇండియా–2024’ సదస్సులో జీఎస్‌ఈసీ ఏర్పాటుపై గూగుల్ కీలక ప్రకటన చేసిందని... పలు రాష్ట్రాలు పోటీపడినా హైదరాబాద్‌లో ఏర్పాటుకే గూగుల్ సంస్థ మొగ్గు చూపిందని తెలిపింది. అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్‌గా పనిచేసే జీఎస్‌ఈసీ.. అధునాతన ఆన్‌లైన్ భద్రత ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించింది.
ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్: సీఎం రేవంత్
గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకు రావడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ అగ్రభాగాన ఉందని ఈ సందర్భంగా గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హాన్సెన్ వ్యాఖ్యానించారు.
జీఎస్‌ఈసీ ద్వారా సైబర్ సేఫ్టీ సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సెంటర్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment