ఆర్ట్స్ కళాశాల రైల్వేస్టేషన్ సమీపంలో భూ త్‌బంగళాలను తలపిస్తున్న పోలీసు క్వార్టర్స్
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న సుమారు 600 ప్రభుత్వ నివాసాలు క్రమేణా భూత్ బంళాలుగా మారిపోతున్నాయి. రాత్రి సమయాల్లో ఇవి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయి. అల్లరి చిల్లరి మూకలు నిరుపయోగంగా ఉంటున్న ఈ ప్రభుత్వ భవన సముదాయాల్లో సృష్టిస్తున్న అలజడులు పరిసర ప్రాంతాలవారికి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి.
►వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సిబ్బందితో దశాబ్దాలపాటు ఈ ప్రాంతం సందడిగా కనిపించిన ఈ భవన సముదాయాలు
కొద్ది సంవత్సరాలుగా అనర్థాలను తెచ్చి పెడుతున్నాయి.
►ప్రస్తుతం మొండిగోడలకే పరిమితమైన ప్రభుత్వ భవనాల సముదాయాలతో రాత్రి వేళల్లో రహదారుల మీదుగా ప్రయాణించేవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..)
వందలాది నివాసాలు..
►తార్నాక ప్రాంతంలో ఓయూ ఉద్యోగుల క్వార్టర్లు, మెట్టుగూడ ప్రాంతంలో రైల్వే ఉద్యోగుల క్వార్టర్లు, ఆర్ట్స్ కళాశాల రైల్వేస్టేషన్ సమీపంలో పోలీసు క్వార్టర్లు మొండిగోడలకు పరిమితమయ్యాయి.
►దశాబ్దాల కాలం పాటు ఈ క్వార్టర్లు ఉద్యోగుల కుటుంబాలతో కళకళలాడాయి. క్రమేణా క్వార్టర్లు శిథిలావస్థకు చేరుతుండడంతో క్వార్టర్లు ఖాళీ అవుతూ వస్తున్నాయి. సంవత్సరాల కాలంగా క్వార్టర్ల భవన సముదాయాలు నిరుపయోగంగా ఉంటుండడంతో సంఘవ్యతిరేకులకు ఆవాసాలుగా మారుతున్నాయి.
►తార్నాక కూడలికి సమీపంలో వంద వరకు ఓయూ అధికారుల క్వార్టర్లు, ఓయూ పీఎస్ పోలీసుల కోసం ఆర్ట్స్ కళాశాల రైల్వేస్టేషన్‌లో నిర్మించిన 100 క్వార్టర్లకు చెందిన ఎనిమిది భవన సముదాయాలు, మెట్టుగూడ ప్రాంతంలో రైల్వే అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మించిన వందల సంఖ్యలోని క్వార్టర్లు ఖాళీగా ఉంటున్నాయి.
తార్నాకలో ముళ్లపొదల మధ్యన ఓయూ ఉద్యోగుల క్వార్టర్లు
పదేళ్లుగా ఖాళీ..
►ఓయూ, రైల్వే, పోలీసు కుటుంబాలు పై ప్రాంతాల్లోని క్వార్టర్స్‌ను పదేళ్ల క్రితమే మొత్తంగా ఖాళీ చేశారు. అప్పటి నుంచి వీటి నిర్వహణ బాధ్యతలు చూసేవారే కరువయ్యారు.
►అసాంఘిక శక్తులతోపాటు తాగుబోతులకు అడ్డాలుగా మారుతున్నాయి. రాత్రి సమయాల్లో ఖాళీగా ఉంటున్న క్వార్టర్స్ ప్రాతంలో పోలీసు గస్తీకూడా కరువైందని...జులాయిలు, తాగుబోతులు సృష్టిస్తున్న అలజడికి భయబ్రాంతులకు గురవుతున్నామని పరిసర ప్రాంతాలవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులకు తలనొప్పి..
►ఖాళీగా ఉంటున్న భవన సముదాయాలు పోలీసులకు కొత్త చిక్కలు తెచ్చిపెడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో సెక్యురిటీ, సీసీ కెమెరా వ్యవస్థ లేని కారణంగా నేరగాళ్లు ఇక్కడ తమ కార్యకలాపాలు పూర్తి చేసుకుని ఉడాయిస్తున్నారు.
►ఆ మీదట కేసును ఛేదించడం, నిందితులను అదుపులోకి తీసుకోవడం కోసం పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. తుకారాంగేట్, చిలకలగూడ, లాలాగూడ, తుకారాంగేట్, ఓయూ పీఎస్ పరిధిలో ఖాళీ భవన సముదాయాలు విస్తరించి ఉన్నాయి.
►నిరుపయోగంగా ఉంటున్న భవన సముదాయాల్లో హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు జరుగుతున్నాయి. సంబంధిత భవనాలు నెలకొన్న ప్రాంతాల్లో సంబంధిత స్థల యజమానులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇబ్బందులు తొలగిస్తాం..
క్వార్టర్లు ఖాళీ చేయించడం, రోడ్ల మూసివేతతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిర్మానుష్యంగా ఉంటున్న ఉద్యోగుల నివాసాల ప్రాంతాల్లో గస్తీ పెంచేందుకు పోలీసులకు అప్రమత్తం చేశాం. జీఎంతోపాటు ఇతర రైల్వే విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి ఖాళీగా ఉంటున్న జనవాసాల నుంచి పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటాం.
–టి.పద్మారావుగౌడ్, డిప్యూటీ స్పీకర్
ప్రయాణిలకు తప్పని ఇబ్బందులు..
మద్యం సేవనాలకు ఇతరత్రా అసాంఘీక కార్యక్రమాలకు నిరుపయోగంగా ఉంటున్న ప్రభుత్వ క్వార్టర్లు నిలయాలుగా మారుతున్నాయి. అతీ కాకుండా రైల్వేస్టేషన్‌తోపాటు సికింద్రాబాద్ ప్రాంతంలో అల్లరిచిల్లరగా తిరిగే వ్యక్తులు ఈ భవన సముదాయాల్లో తిష్టవేసి అలజడి సృష్టిస్తున్నారు.
–శివకృష్ణ, సీతాఫల్‌మండి
Comments
Please login to add a commentAdd a comment