
రాజేంద్రనగర్‌లోని మిల్లెట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి తోమర్. చిత్రంలో సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా దేశంలోని వేలాదిమంది రైతుల ఆదాయం రెట్టింపు అయిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ‘ఇటీవల జమ్మూ, కశ్మీర్ పర్యటన సందర్భంగా ‘కుంకుమ పువ్వు’ల సాగు కేంద్రంలో ఓ రైతు నాతో మాట్లాడుతూ గతంలో తమకు కిలో కుంకుమపువ్వుకు రూ.లక్ష వరకూ అందేదని, ‘కేసర్ పార్క్’ఏర్పాటైన తరువాత, సాగు, మార్కెటింగ్‌లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చిన తరువాత రెట్టింపు ధర లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశార’ని మంత్రి తెలిపారు.
అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం (2023) వేడుక సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లావు బియ్యం కొనుగోలు చేస్తారా? లేదా? అని విలేకరులు అడగ్గా.. ‘‘ఎఫ్‌సీఐ ద్వారా సేకరించే బియ్యం మళ్లీ ప్రజలకే పంచుతున్నాం. ఈ క్రమంలో సేకరించే బియ్యం నాణ్యమైందా? కాదా? అన్నది చూస్తాం. ప్రజలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం’’అని అన్నారు. చిరుధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థలో చేర్చే ప్రయత్నం చేస్తారా? అన్న ప్రశ్నపై మాట్లాడుతూ ‘‘రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందరికీ సరఫరా చేయాలని నిర్ణయిస్తే, కేంద్రం అనుమతి పొందితే తాము సేకరించేందుకు సిద్ధమే’’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment