సాక్షి, హైదరాబాద్ : తుంగభద్ర పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం బుధవారం రూ.2.50 కోట్లు విడుదల చేసింది. ఈనెల 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈ ఉత్సవాలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. గతంలో గోదావరి, కృష్ణా పుష్కరాల మాదిరిగా భక్తులు పెద్దసంఖ్యలో హాజరైతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేకంగా పుష్కరాల కోసం ఏర్పాట్లు చేయొద్దని నిర్ణయించింది. ఇందులో భాగంగానే అధికారికంగా పుష్కరఘాట్లను కూడా ఏర్పాటు చేయటం లేదు. ఆలంపూర్‌లోని జోగులాంబ దేవాలయం వద్ద మాత్రమే ఆలయం పక్షాన ఏర్పాట్లు ఉంటాయని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment