సిరిసిల్ల: రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఇంకా ఎవరైనా రాని వారు ఉంటే.. వెతికి పట్టుకొని అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు.
కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే 24 గంటల కరెంట్, ఇంటింటికీ తాగునీరు, పొలాలకు సాగునీరు, అర్హులకు ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మీ.. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామన్నారు. దేశంలోనే బీడీ కార్మికులను పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే ఎక్కడ కూడా రైతులకు జీవిత బీమా చేయించలేదని, ఒక్క తెలంగాణలోనే 40 లక్షల మంది రైతులకు ఏటా రూ.1,450 కోట్లు ప్రీమియం చెల్లించి బీమా చేయిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో లక్ష రైతుకుటుంబాలకు రూ.5వేల కోట్ల బీమా సాయం అందిందని వివరించారు.
31 వేల మంది గిరిజన ప్రజాప్రతినిధులు
రాష్ట్రంలో 3,416 గిరిజన తండాలను, గూడేలను గ్రామపంచాయతీలుగా చేశామని సర్పంచులను నుంచి వార్డు సభ్యుల వరకు 31వేల మంది గిరిజనులు పాలనలో భాగస్వాములయ్యారని కేటీఆర్ వెల్లడించారు. గిరిజన బిడ్డలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని, పోడు భూములకు త్వరలోనే పట్టాలు ఇస్తామని తెలిపారు. గ్రామాల్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ.. పల్లెల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టాలని సర్పంచులను మంత్రి కోరారు.
మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు సారూ.. స్పందించిన కేటీఆర్.. కలెక్టర్‌కు ఆదేశాలు
జిల్లాలోని బాకూర్‌పల్లితండాలో ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూ.. మంత్రి కేటీఆర్ మీకు మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవా? అని మహిళలను ప్రశ్నించారు. వస్తలేవంటూ.. మహిళలు చెప్పడంతో కేటీఆర్ స్పందించారు. ‘ఎందుకు రావడం లేదు.. పైపులైన్ వేశాం, ట్యాంకు కట్టాం.. కారణం ఏంటి..? సాయంత్రంలోగా మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి నాకు నివేదిక ఇవ్వాలని’కలెక్టర్‌ను ఆదేశించారు.
స్థానిక సర్పంచ్ స్పందించి.. ‘ఇక్కడ బోర్లు ఉన్నాయి.. బోరు నీళ్లే వాడుకుంటున్నారు.. మిషన్ భగీరథ నీళ్లు తాగడం లేదని’అన్నారు. ‘ప్రభుత్వం వేసినా మీరు తాగకుంటే ఎలా.. బోరు నీరు తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ ఇష్టమని’కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల్లో గిరిజన భవన్‌ను కట్టుకుందామన్నారు.
చదవండి: ఉన్నమాట అంటే ఉలిక్కిపడుతున్నారు.. ఏపీ మంత్రులపై హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment