చీలపెల్లిలో ప్రహరీ లేని పాఠశాల
సాక్షి, సిర్పూర్(టి)(ఆదిలాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న ప్రజాప్రతినిధుల మాటలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. సిర్పూర్(టి) మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ లేక తరగతి గదులు, ఆవరణ మందుబాబులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు తెరుచుకోకపోవడంతో మందుబాబులు పాఠశాలలను స్థావరాలుగా ఏర్పాటు చేసుకోవడంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పశువులు సైతం పాఠశాల ఆవరణలో తిరుగుతుండటంపై పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.
మొత్తం పాఠశాలలు 54
మండలంలోని గ్రామాల్లో మూడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎనిమిది ప్రాథమికోన్నత పాఠశాలలు, 43 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిల్లో ఒక్కదానికి సైతం ప్రహరీ లేకపోవడం విడ్డూరం. సిర్పూర్(టి)లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీకి కొంత గోడ నిర్మించినా కూలిపోవడంతో రక్షణ కరువైంది. లోనవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనూ అదే దుస్థితి నెలకొంది. చీలపెల్లి, భూపాలపట్నం, మాకిడి, జక్కాపూర్, ఇటిక్యాల పహాడ్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు పక్కనే వాగులు, అటవీప్రాంతాలు ఉన్నాయి. కాని వీటికి ప్రహరీ లేకపోవడంతో పాములు, విషపురుగులు యథేచ్ఛగా పాఠశాలల్లోకి వస్తున్నాయి.
కాగితాలకే పరిమితమైన హామీలు..
ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రహరీ నిర్మిస్తే పాఠశాలల్లోకి పశువులు, మందుబాబులు రాకుండా ఉంటారని గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.
సౌకర్యాలు కల్పించాలి
ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మించి సౌకర్యాలు కల్పించాలి. అధికారులు నిధులు మంజూరు చేసి సమస్య పరిష్కరించాలి. గ్రామంలోని పాఠశాలకు ప్రహరీ నిర్మిస్తే మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది. పశువులు లోనికి రాకుండా ఉంటాయి.
– సత్యనారాయణ, చీలపెల్లి
Comments
Please login to add a commentAdd a comment