సాక్షి, హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సిజేరియన్ వికటించి ఇద్దరు బాలింతలు మృతిచెందడం పట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు సర్కారీ ఆస్పత్రులే ఆఖరి ఆశ అని ఆమె వ్యాఖ్యానించారు. గైనకాలజిస్టుగా తనకు ఈ ఘటనపై ఎన్నో ప్రశ్నలున్నాయని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని అనుకున్నానని, కానీ సంక్రాంతి పండుగని ఆగానని అన్నారు.
గతంలో సైతం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలో నలుగురు మహిళలు మరణించారని గుర్తు చేశారు. జనాభా అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపడాలని ఆమె అభిప్రాయపడ్డారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకల్లో ఆమె పాల్గొని మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులు తన పరిశీలనలో ఉన్నాయనీ పెండింగ్‌లో లేవని తెలిపారు.
యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లులోని అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటీ నియామకాల బిల్లుపై న్యాయ వివాదాలు వచ్చే అవకాశం ఉందని, దీంతో నియామకాల్లో జాప్యం జరగరాదని తన భావనని చెప్పారు. ఈ తరహా విధానాలకు గతంలో న్యాయ స్థానాలు అభ్యంతరం తెలిపాయన్నారు. బిల్లుపై యూజీసీ కొన్ని అంశాలను లేవనెత్తిందని గవర్నర్ వెల్లడించారు. వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కావాలని తన అభిమతమన్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై స్వయంగా తయారు చేసిన పొంగళిని సూర్యుడికి సమర్పించిన అనంతరం ఉత్సవాల్లో పాల్గొన్న వారికి వడ్డించారు.
Comments
Please login to add a commentAdd a comment