ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా భారత్‌  | Governor Tamilisai Soundararajan Speaks About National Education Policy | Sakshi
Sakshi News home page

ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా భారత్‌ 

Published Fri, Aug 14 2020 2:36 AM | Last Updated on Fri, Aug 14 2020 5:00 AM

Governor Tamilisai Soundararajan Speaks About National Education Policy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ 2020’భారతదేశాన్ని విద్యా రంగంలో ప్రపంచ స్థాయిలో నిలపడానికి తోడ్పడుతుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. మూడున్నర దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ జాతీయ విద్యా విధానం భారతదేశ విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణల ద్వారా 21వ శతాబ్దపు విద్యా విధానానికి శ్రీకారం చుడుతుందని తెలిపారు. ‘పర్‌స్పెక్టివ్‌ ఆన్‌ నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ 2020: రోడ్‌ మ్యాప్‌ ఫర్‌ తెలంగాణ’అన్న అంశంపై విద్యారంగ ప్రముఖులతో గవర్నర్‌ గురువారం వెబినార్‌ నిర్వహించారు.

మెజారిటీ యువతరం ఉన్న భారత్‌ లాంటి దేశాల్లో నైపుణ్యాల శిక్షణ, గ్లోబల్‌ పోటీని తట్టుకునే విధంగా ఉద్యోగ నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ప్రోత్సహించే విధంగా ఈ నూతన విద్యా పాలసీని కస్తూరి రంగన్‌ నేతృత్వంలోని కమిటీ రూపొందించిందని వివరించారు. గత నాలుగు దశాబ్దాల్లో ప్రపంచం కనివినీ ఎరుగని విధంగా మారిందని, అందుకు అనుగుణంగా కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్, నానో టెక్నాలజీ, కోడింగ్, డిజిటల్‌ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఫార్మా, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తూనే భారతీయ మూలాలను గౌరవించే ఈ విద్యా విధానానికి రూపకల్పన జరిగిందన్నారు.  

మాతృభాషతో మానసినక వికాసం: ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనతోనే పిల్లల్లో గొప్ప మానసిక వికాసం సాధ్యమవుతుందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. భారతీయ మూలాలు, ఆధునీకత కలబోసిన భవిష్యత్‌ తరాలను ప్రపంచస్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే ఈ నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ లక్ష్యమన్నారు. విద్యా రంగంలో భారత్‌ గొప్ప స్థాయిని, పునర్‌ వైభవాన్ని పొందాలంటే విద్యారంగ నిపుణులు, అధ్యాపకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నూతన విద్యా విధానం ద్వారా దేశంలో తెలంగాణ ఉన్నత విద్య హబ్‌గా ఎదిగేందుకు అపార అవకాశాలున్నాయని గవర్నర్‌ తెలిపారు.

ఇక్కడ ఎన్నో ప్రముఖ విద్యా, పరిశోధనా సంస్థలు ఉండటం, హైదరాబాద్‌ ఫార్మా, ఐటీ హబ్‌గా, బయో టెక్నాలజీ హబ్‌గా పేరున్న దృష్ట్యా ఇక ఉన్నత విద్యా హబ్‌గా, ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా ఎదగడానికి అవకాశముందని పేర్కొన్నారు. ఈ వెబినార్‌లో ఇఫ్లూ వైస్‌ చాన్స్‌లర్‌ సురేష్‌ కుమార్, అన్నా యూనివర్సిటీ మాజీ వీసీ బాల గురుస్వామి, సెస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రేవతి, తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ వెంకట రమణ, నల్సార్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ బాలకిష్టారెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement