
బీబీనగర్ ఎయిమ్స్‌లో వైద్య విద్యార్థినికి వైట్‌కోట్ తొడుగుతున్న గవర్నర్ తమిళిసై
బీబీనగర్: తెలంగాణలో వైద్య సేవలు అద్భుతంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు మెరుగైన వైద్యాన్ని చేరువ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వైద్యసేవలను విస్తృతపర్చడం, రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్ కళాశాలలో శనివారం 2021–22 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులకు నిర్వహించిన వైట్‌కోట్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. వైద్యరంగంపై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, వైద్య వృత్తి కష్టతరమైనదైనా, దాని ద్వారా ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశముందని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలతో వైద్యులు మమేకం కావాలని సూచించారు.
క్లిష్టపరిస్థితుల్లో ఉన్నవారిని కాపాడా..
తాను గైనకాలజిస్టుగా సేవలు అందించానని, 800కు పైగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి డెలివరీలు చేసి చిన్నారులను కాపాడానని గవర్నర్ తన అనుభవాలను చెప్పారు. ఇప్పుడు శిశువులు తక్కువ బరువుతో జన్మిస్తున్నారని, అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా వైద్యులు గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రధాని ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, జనఔషధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీబీనగర్‌లోని ఎయిమ్స్ తెలంగాణకే గర్వకారణమని, రెండేళ్లలో ఎంతో పురోగతి సాధించిందని తమిళిసై అన్నారు. అనంతరం గవర్నర్ విద్యార్థులకు స్వయంగా వైట్‌కోట్ వేసి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment