శంకర్‌పల్లి ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ యువకుడు శ్రీనివాసశర్మ (పేరుమార్చాం). తరతరాలుగా కుటుంబం నిర్వహిస్తున్న వైదిక వృత్తిలో కొనసాగుతున్నాడు. ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ స్థానిక దేవాలయంలో అర్చకుడిగా కొనసాగుతున్నాడు. శంకర్‌పల్లి ప్రాంతంలో రూ.కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులన్నాయి. కానీ 30 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదు. తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసినా ఎక్కడా ముడి పడలేదు. దీంతో వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ బ్రాహ్మణ కుటుంబంలోని అమ్మాయికి రూ.4 లక్షల ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం విశేషం.
తాండూరు పట్టణంలోని గంజ్ ప్రాంతానికి చెందిన నగేష్ (పేరు మార్చాం) 25 ఏళ్లు దాటిన యువకుడు. ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన ఇతను వ్యాపారంలో స్థిరపడ్డాడు. వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఐదేళ్లుగా సంబంధాలు చూస్తున్నారు. పదుల సంఖ్యలో పెళ్లి చూపులకు హాజరయ్యాడు. అబ్బాయి నచ్చితే అమ్మాయి నచ్చలేదు.. అమ్మాయి నచ్చిన చోట అబ్బాయికి నచ్చలేదు. ఇలా రెండేళ్ల కాలం కరిగిపోయింది. నెల రోజుల క్రితం సమీప బంధువులు ఓ సంబంధం తీసుకొచ్చారు. అమ్మాయి తరఫు వారి ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసింది. పిల్ల నచ్చడంతో వెంటనే రూ.2 లక్షల ఎదురు కట్నం ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు. వారం రోజుల క్రితం తాండూరులో ఈ జంట ఒక్కటైంది.
రంగారెడ్డి (తాండూరు) : పెళ్లి కూతురు తల్లిదండ్రులు.. వరుడికి కట్నం ఇవ్వాలనే సంప్రదాయానికి రానున్న రోజు ల్లో అడ్డుకట్ట పడనుందా..? ఇటీవల జరుగుతున్న పలు వివాహాలు ఈ వాదనలకు బలంచేకూరుస్తు న్నాయి. దశాబ్దాల క్రితం ‘కన్యాశుల్కం’ పేరుతో వధువుకు ఎదురు కట్నం ఇచ్చి వివాహాలు చేసుకునే వారు. వయసు మీరిన వరుడి తరఫు వారు.. అమ్మాయి కుటుంబ సభ్యులకు డబ్బు ఆశ చూపి ఇలా చేసేవారు. ఆర్థిక స్థితి అంతగా లేని వధువుల కుటుంబాలు అప్పట్లో ఈతంతుకు అంగీకరించేవి. ప్రస్తుతం 25 ఏళ్లు నిండని యువకులు సైతం ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్న సంద ర్భాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల జరిగిన వివాహాల్లో.. పదుల సంఖ్యలో ఎదురు కట్నం ఇచ్చి చేసుకున్నవే కావడం గమనార్హం.
పెళ్లి ఖర్చులు సైతం..
వధువు కోసం వెతికివెతికి వేసారిపోతున్న అబ్బాయిల తల్లిదండ్రులు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. అమ్మాయి నచ్చితే ఎదురు కట్నం ఇచ్చి, పెళ్లి ఖర్చులు సైతం భరిస్తున్నారు. తాండూరులో ఓ సామాజిక వర్గానికి చెందిన యువకుడి వివాహం కోసం రూ.2 లక్షలు, వధువుకు 10 తులాల బంగారం ఎదురు కట్నంగా ఇచ్చారు. ఇక్కడ ఇలాంటి పెళ్లిళ్లు సాధారణంగా మారాయి.
గిరిజనుల్లో ఓలీ
గిరిజన సంప్రదాయంలో ఇంటి ఎదుట ఉన్న ఎద్దు ధర ఎంత పలుకుతుందో.. అంత డబ్బు అమ్మాయికి కట్నంగా ఇచ్చే సంప్రదాయం గతంలో ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా తండాల్లోని యువకులు విద్యావంతులు కావడంతో ఉద్యోగాలు సాధించారు. దీంతో తమ బిడ్డను ఉద్యోగస్తుడికి ఇవ్వాలనే ఆరాటం, పోటీతత్వంతో కట్నం (డౌరీ) సంప్రదాయం వచ్చింది. అయినప్పటికీ గిరిజన సంప్రదాయం ప్రకారం అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే మొదట వధువు కట్నం (ఓలీ) ఇవ్వాల్సిందే. ప్రస్తుతం ఓలీ పేరిట అమ్మాయికి రూ.1.05 లక్షల వరకు ఇస్తున్నారు. ఆ తర్వాత వధువు తరఫు వారు తిరిగి వరకట్నం ఇవ్వడం ఆనవాయితీగా మారిందని గిరిజన నాయకులు చెబుతున్నారు.
అమ్మాయిల సంఖ్య తక్కువ
ఈ వేసవి సీజన్‌లో జరిగిన పలు పెళ్లిళ్లలో వధువుకు ఎదురు కట్నం ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బ్రాహ్మణ, ఆర్యవైశ్య, మార్వాడీ, రెడ్డి సామాజిక వర్గాల కుటుంబాల్లో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. బ్రాహ్మణ కుటుంబాల్లో వివాహ వయసు దాటిపోయినా పెళ్లికాని యువకులు అనేక మంది కనిపిస్తున్నారు. ఆలయాల్లో అర్చకత్వం చేసే వారికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేందుకు వధువు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. సాఫ్ట్‌వేర్, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే తప్ప పిల్లనిచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఆస్తిపాస్తులు దండిగా ఉన్నా ఆసక్తి చూపడం లేదు. ఆర్యవైశ్యుల్లో కిరాణ వ్యాపారం చేసుకొనే యువకులకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఉద్యోగం ఉన్న యువకులకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
పెళ్లిళ్లు కుదరడం లేదు
పలు సామాజికవర్గాల్లో పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. ప్రధానంగా బ్రాహ్మ ణ, ఆర్యవైశ్య, మార్వాడీ కుటుంబాల్లో అమ్మాయిల కొరత కనిపిస్తోంది. దీంతో యువకులకు 35 ఏళ్లు దాటినా సంబంధాలు కుదరడం లేదు. అబ్బాయి పెళ్లి వయసు దాటిపోతోందనే కారణంతో ఎదురు కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇలాంటి వివాహాలు పదుల సంఖ్యలో జరిగాయి.
– రాఘవేంద్రాచారి,
బ్రాహ్మణ సంఘం ప్రతినిధి, బషీరాబాద్
Comments
Please login to add a commentAdd a comment