కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో రూ. 500లకే వంట గ్యాస్ అందజేస్తామని ప్రకటించింది. దీంతో గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ (నో యువర్ కస్టమర్) చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ కేవైసీతో సంబంధం లేదని అధికారులు, డీలర్లు చెబుతున్నా ఏజెన్సీల వద్ద మహిళలు బారులు తీరుతున్నారు. తమ పనులు వదులుకొని వినియోగదారులు ఉదయం 8 గంటల నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కడుతున్నారు.
హైదరాబాద్: ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, షేక్‌పేట, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, బోరబండ, వెంగళ్‌రావునగర్, శ్రీనగర్ కాలనీ డివిజన్ల పరిధిలో తొమ్మిది గ్యాస్ ఏజెన్సీలు ఉండగా 3.40 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు.
► ఇందులో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు 83,127 మంది ఉండగా, అన్నపూర్ణ అన్నయోజన కార్డు కలిగిన వారు 3368 మంది కలిగి ఉన్నారు.
► ప్రభుత్వం రూ. 500 గ్యాస్ సిలిండర్‌పై ఇంత వరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకున్నా తెల్లరంగు రేషన్ కార్డుదారులకు వర్తిస్తుందని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో వార్తలు వైరల్ అవుతుండటంతో ఇటు తెల్లకార్డుదారులు, అటు సాధారణ గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు.
► ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ. 500కే వంట గ్యాస్ అందిస్తామని చెప్పింది. ఈ పథకానికి ఈ కేవైసీకి సంబంధం లేదని దీనికి నిర్దిష్టగడువు కూడా ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు రావొద్దని ఏజెన్సీల నిర్వాహకులు ఏకంగా బ్యానర్లే కడుతున్నారు.
ఉజ్వల పథకానికి మాత్రమే...
► కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల పథకానికి మాత్రమే ఈ కేవైసీ చేయాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద గతంలో మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ పథకంలోని లబి్ధదారులకు ప్రభుత్వం రాయితీపై గ్యాస్ అందజేస్తుంది. ఈ పథకంలో మృతి చెందిన వారి వివరాలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీని ప్రవేశ పెట్టింది. మహిళలు బయోమెట్రిక్ చేయించి నమోదు చేయించుకోవాలని వేలి ముద్రలు పడకపోతే ఐరిష్ విధానంలో ఈ కేవైసీని పూర్తి చేస్తారు.
వాస్తవాలు తెలియని వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. రెండేళ్లకోసారి ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. లబి్ధదారుల సంఖ్య, మృతులు, ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి బదిలీ చేయించుకోవడం, కనెక్షన్ రద్దు చేసుకోవడం, తదితర కారణాలు తెలుసుకునేందుకు ఇది వీలవుతుంది. ఇందులో భాగంగానే కచి్చతమైన సంఖ్య తెలుసుకోవడానికి లబి్ధదారుల వేలిముద్రలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మార్గర్శకాలు వచి్చన వెంటనే వినియోగదారులకు, గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం అందిస్తామని అధికారులు పేర్కొంటున్నా వినియోగదారులు వినిపించుకోకుండా గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు.
ఇంటి వద్దకే డెలివరీ బాయ్స్ వస్తారు
గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. మా డెలివరీ బాయ్స్ ఇంటికే వచ్చి ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారు. ఇందులో భాగంగా సెల్‌ఫోన్లు, ఐరిష్ విధానంలో కళ్లను స్కాన్ చేస్తారు. దీనికి అంతరాయం ఏర్పడితేనే గ్యాస్ ఏజెన్సీలకు రప్పిస్తాం. గృహ వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
రూ. 500 సిలిండర్ కోసం చాలా మంది ఏజెన్సీలకు వస్తున్నారు. తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతోంది. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సదరు పథకం కింద లబ్ధి పొందాలని కాంక్షిస్తూ ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నారు. వదంతులు నమ్మవద్దు, ఇంకా మార్గదర్శకాలు రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఈ కేవైసీ ప్రక్రియకు రాయితీ సిలిండర్‌కు ఎలాంటి సంబంధం లేదు. వినియోగదారులు అనవసరంగా ఆందోళనకు గురికావొద్దు.
– బి.శ్రీనివాస్, గ్యాస్ డీలర్, జూబ్లీహిల్స్
Comments
Please login to add a commentAdd a comment