సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కోవిడ్ చికిత్సలు అందించాలని, నిబంధనలను ఉల్లంఘించి ప్రజలను అధిక ఫీజుల కోసం వేధిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ప్రస్తుతం రోగుల వద్దకు పీపీఈ కిట్లు లేకుండా కేవలం మాస్క్‌లతోనే డాక్టర్లు వెళ్లగలుగుతున్నందున, వాటికి అదనంగా చార్జీలు వసూలు చేయొద్దని సూచించారు. కోవిడ్ రోగులకు బెడ్ల కేటాయింపు అంశంపై శనివారం మంత్రి ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలతో వేర్వేరు గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా చికిత్స, ఆసుపత్రుల్లో బెడ్‌ల చార్జీలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల వసూళ్లకు సంబంధించి అంశాలు చర్చకు వచ్చాయి. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కాగా, తమకు సరిపడా వైద్య పరికరాలు, మందులు, ఆక్సిజన్ వంటివి ఉచితంగా సరఫరా చేయాలని ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులకు ప్రభుత్వమే కావాల్సిన మందులు సరఫరా చేస్తుందన్నారు. ప్రైవేట్ వైద్య కాలేజీల అనుబంధ ఆసుపత్రుల్లో 14 వేలకు పైగా బెడ్స్ ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలోనూ కావాల్సినన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 50 శాతం బెడ్స్, ఉచిత చికిత్స..
ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అవసరమైన మం దులు, ఆక్సిజన్, ఇతర పరికరాలను ప్రభుత్వం అందిస్తున్నందున కోవిడ్ రోగులకు 50 శాతం బెడ్స్ కేటాయింపుతో పాటు, అక్కడ కరోనా పేషెంట్లకు ఉచితంగా చికిత్స చేయాలని సూచించినట్టు మంత్రి ఈటల చెప్పారు. అలా అని అవసరం లేకపోయినా చికిత్సకోసం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చేరేందుకు రావొద్దని, డాక్టర్లు సిఫారసు చేస్తేనే వాటిలో చేరాలని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు వ్యాపార ధోరణితో కాకుండా మానవీయ దృక్పథంతో ఎక్కువ ఫీజులు వసూలు చేయకుండా కరోనా రోగులకు వైద్యం అందించాలని కోరామన్నారు. వ్యాక్సిన్ల కొరతపై కేంద్రానికి లేఖ రాసినట్టు చెప్పారు.
కరోనాపై అప్రమత్తంగా ఉండాలి..
కరోనా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈటల రాజేందర్ సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నందున ఫంక్షన్లు, బహిరంగ సభలకు, సమావేశాలకు వెళ్లకూడదని సూచించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూ విధింపు వంటివి ఉండవన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఏపీలలో కేసుల తీవ్రత కారణంగానే తెలంగాణలో కూడా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. కేసుల సంఖ్య పెరిగినా.. వైరస్ తీవ్రత తక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వం 50 శాతం బెడ్లు కోరింది..
కరోనా నేపథ్యంలో 50 శాతం బెడ్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధి డాక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. మందులు, ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరినపుడు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 750 చొప్పున బెడ్స్ ఉంటాయని తాము యాభై శాతం బెడ్స్ ఇస్తామని ప్రభుత్వానికి చెప్పినట్టు మల్లారెడ్డి కాలేజీ ప్రతినిధి భద్రారెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్‌ను కూడా ప్రజలకు ఉచితంగా అందిస్తామని మహేశ్వర మెడికల్ కాలేజీ ప్రతినిధి డాక్టర్ కృష్ణారావు చెప్పారు.
సెకండ్ వేవ్‌తో ప్రమాదం ఏమీ లేదు..
ప్రస్తుతం వంద మంది కోవిడ్ రోగులు వస్తే కేవలం ముగ్గురు మాత్రమే వెంటిలేటర్ వరకు వెళ్తున్నారని కిమ్స్ ప్రతినిధి భాస్కర్‌రావు తెలిపారు. సెకండ్‌వేవ్‌తో ప్రమాదం ఏమి లేదన్నారు. ఇంకో మూడు సంవత్సరాలు జాగ్రత్త పడితేనే బయటపడతామన్నారు. కాగా, ఫీజులు.. బిల్లుల విషయంలో ప్రైవేటు ఆసుపత్రులపై ఆరోపణలు రావడం సహజమేనన్నారు. అయితే లోన్లు కట్టలేదని బ్యాంకు అధికారులు వచ్చి ఆసుపత్రులను సీజ్ చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
చదవండి:
ఈఎస్ఐ స్కాం: నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు
ముగ్గురు మాయ లేడీలు.. భలే దోపిడీలు!
Comments
Please login to add a commentAdd a comment