గుండెను తరలిస్తున్న బాక్సుతో జూబ్లీహిల్స్‌లో రైలు దిగుతున్న వైద్య సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: చావు బతుకుల్లో ఉన్న ఒక వ్యక్తికి హైదరాబాద్ మెట్రో ఆపద్బంధువుగా నిలిచింది. అత్యవసరంగా గుండెను తరలించి నిండు ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో తన వంతు సహకారం అందించింది. మెట్రో సహకారంతో.. విపరీతమైన ట్రాఫిక్ ఉండే మహా నగరంలో ఓ మూలన ఉన్న ఆస్పత్రి నుంచి మరో మూలన ఉన్న ఆస్పత్రికి కేవలం 37 నిమిషాల్లోనే వైద్యులు గుండెను తరలించగలిగారు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన రైతు వరకాంతం నర్సిరెడ్డి (45) గత నెల 31 అస్వస్థతకు గురై హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చేరాడు.
సోమవారం అతని బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించిన వైద్యులు విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. జీవన్‌దాన్ ప్రతినిధుల కౌన్సెలింగ్‌తో వారు అతని అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి గుండె మార్పిడి శస్త్రచికిత్స అత్యవసరమని గుర్తించి నర్సిరెడ్డి గుండెను అతనికి అమర్చాలని నిర్ణయించారు. అంబులెన్స్‌లో ఎల్బీ నగర్ నుంచి జూబ్లీహిల్స్‌కు సకాలంలో గుండెను తీసుకురావడం కష్టమని భావించిన అపోలో వైద్యులు మెట్రో రైలు అధికారులను సంప్రదించారు. ప్రత్యేక రైలు ఏర్పాటుకు వారు ఓకే చెప్పడం, పోలీసులు సైతం సహకరించడంతో గుండె తరలింపు ప్రక్రియకు మార్గం సుగమం అయ్యింది.
మెట్రో రైలులో గుండెను తరలిస్తున్న వైద్యులు
ఆద్యంతం ఉత్కంఠ
మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచే ఎల్భీనగర్–నాగోల్ మార్గంలో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ పోలీసుల పహరా, అంబులెన్స్‌కు పైలెటింగ్ చేయడానికి పోలీసు వాహనాలు దారి పొడవునా సిద్ధమయ్యాయి. వైద్యులు నర్సిరెడ్డి గుండెను సేకరించిన తర్వాత.. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ గోఖలే నేతృత్వంలో అరుగురు సభ్యుల వైద్య బృందం సాయంత్రం 4.36 గంటల ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య అంబులెన్స్‌లో కామినేని ఆస్పత్రి నుంచి బయలుదేరారు. కేవలం ఐదు నిమిషాలలోనే నాగోల్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. మరో నిమిషంలో స్టేషన్‌లో సిద్ధంగా ఉంచిన ప్రత్యేక మెట్రో రైల్‌లోకి చేరుకున్నారు.
వెంటనే బయలుదేరిన రైలు.. మార్గం మధ్యలోని 16 మెట్రో స్టేషన్లలో ఎక్కడా ఆగకుండా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ వరకు మొత్తం 21 కి.మీ మార్గాన్ని 28 నిమిషాల లోపుగానే రైలు చేరుకుంది. రైలును ఈ సమయంలో గంటకు 40 కేఎంపీహెచ్ వేగంతో నడిపారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో రెండున్నర నిమిషాల్లోనే అపోలో ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి అపోలో వరకు కూడా పోలీసులు గ్రీన్‌ఛానెల్ ఏర్పాటు చేశారు. డాక్టర్ గోఖలే నేతృత్వంలోని వైద్య బృందం సాయంత్రం 5.15 గంటలకు గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్రారంభించింది. నగరంలో మెట్రోలో గుండెను తరలించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా నగరంలో మార్పిడి చేసే అవయవాల తరలింపు, అత్యవసర వైద్యసేవలకు మెట్రో సేవలను వినియోగించుకోవాలంటూ.. ట్రాఫిక్ రద్దీ, వీఐపీల రాకపోకలతో అంబులెన్స్‌లు నిలిచిపోవడాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.
గుండెను సకాలంలో తరలించాం
ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన గుండెను బ్రెయిన్ డెడ్ వ్యక్తి శరీరం నుంచి తీసిన నాలుగు గంటల్లోగా తిరిగి అమర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండెను సకాలంలో అపోలోకు చేరవేసేందుకు మెట్రో జర్నీ ఉపకరించింది. – డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, గుండె మార్పిడి నిపుణులు, అపోలో ఆస్పత్రి
ప్రజా సేవకు మెట్రో ముందుంటుంది
ప్రజాసేవలో మెట్రో ఎప్పుడూ ముందుంటుంది. ఓ నిండు ప్రాణం కాపాడేందుకు మా వనరులను వినియోగించేంలా మాకో అవకాశం దక్కింది. నాగోల్–జూబ్లీహిల్స్ మధ్య రైలును ఏ స్టేషన్‌లోనూ ఆపకుండా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశాం. – కేవీబీ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment