సాక్షి, హైదరాబాద్: గట్టి ప్లాన్స్.. మట్టి వాల్స్.. రాతికీ రాతికీ మధ్య సున్నం మిశ్రమం కూడా లేదు.. రాతి మీద రాతిని పేర్చి పొందికగా కట్టిన నిర్మాణం.. అయినా వందల ఏళ్లపాటు పదిలం.. ఇది గోల్కొండ కోట ప్రత్యేకత. తాజాగా కూలిన నిర్మాణాలు పరిశీలిస్తే 80 శాతం మట్టితోనే కట్టినట్టు స్పష్టమవుతోంది. కాకతీయుల హయాంలో మట్టితో కోటగోడలు కట్టడం ప్రత్యేకత. గోల్కొండను కూడా వారు అలాగే నిర్మించారు. ఆ తర్వాత దాన్ని ఆక్రమించిన బహమనీల నుంచి స్వాధీ నం చేసుకున్న కుతుబ్‌షాహీలు దాన్ని కొంత పటిష్ట పరిచారు. ఇప్పుడు అది క్రమంగా కూలిపోవటం ప్రారంభమైంది. ఇటీవలి భారీవర్షాలకు నయాఖిల్లాలో కూలిన మజ్నూ బురుజు, కోట పైభాగంలో ఉన్న జగదాంబిక ఆలయం వైపు వెళ్లే క్రమంలో కూలిన మెట్ల వద్ద ప్రాకారం శిథిలాల్లో మట్టి తప్ప డంగు సున్నం మిశ్రమం లేదు.
నిర్మాణం మొత్తం డంగు
సున్నంపూత పూయకుంటే ప్రమాదమే..
ఇటీవలి వర్షాలకు మూడు ప్రాంతాల్లో గోడలు కూలిపోయిన నేపథ్యంలో భారత పురావస్తు సర్వేక్షణ (ఏఎస్‌ఐ) విభాగం అధికారులు దాన్ని ఆసాంతం పరిశీలించారు. డంగు సున్నం పూత లేని ప్రాంతాల్లో, గోడల్లో మొక్కలు మొలిచి వాటి వేళ్లు పాకిపోవటంతో పగుళ్లు ఏర్పడి, కాలక్రమంలో అవి వెడల్పుగా మారినట్టు భావిస్తున్నారు. ఆ పగుళ్లకు సకాలంలో మరమ్మ తులు చేయకపోవటంతో వర్షం నీళ్లు లోపలికి చేరి మట్టి కరిగి గోడలు కూలిపోవటం ఆరంభించాయి. ఇప్పుడు ఉన్నఫళంగా కోట గోడలకు డంగు సున్నం పూతలు పూయనిపక్షంలో నిర్మాణాలు కూలిపోవటం ఖాయ మని నిపుణులు తేల్చారు. (చదవండి: గోల్కొండ ఖిల్లా.. ఇలా అయితే ఎలా?)
ఏం చేయాలంటే..
1 పెయింటింగ్ వర్క్: కోట ప్రధాన ప్రాకారం మొదలు, అంతర్గత గోడల వరకు అన్నీ మట్టితో నిర్మించి ఉన్నాయి. మట్టితో గోడలు నిర్మించి వాటికి వెలుపల, లోపలివైపు రాళ్లను పేర్చారు. రాళ్లు పడిపోగానే లోపల ఉన్న మట్టి జారిపోతోంది. ఇప్పుడు ఆ రాళ్లకు.. లోపల, బయటివైపు డంగు సున్నం మిశ్రమంతో సంప్రదాయపద్ధతిలో పూత పూయాల్సి ఉంది.
2 గ్రౌటింగ్: కొన్ని గోడలకు ఏర్పడ్డ పగుళ్లు బాగా వెడల్పుగా మారిపోయాయి. ఇటీవల జగదాంబిక దేవాలయం మార్గంలో కూలిన గోడకు కుడివైపు పైనుంచి కింది వరకు ఉన్న పగుళ్లు ఇలా వెడల్పుగా మారి భయపెడుతున్నాయి. ఇలాంటి పగుళ్లను వెంటనే మూసేయాల్సి ఉంది. ఏఎస్‌ఐ నిర్వహణ పద్ధతి ప్రకారం.. ఇటుక ముక్కలను లోనికి దూర్చి వాటికి డంగు సున్నం మిశ్రమంతో కోట్ వేస్తారు. ఆ తర్వాత పై భాగంలో అదే మిశ్రమంతో రాళ్ల మధ్య పూస్తారు. ఇప్పుడు అన్ని గోడలకు ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది.
3 కోపింగ్: గోడల పైభాగం నుంచి వాన నీళ్లు లోనికి వెళ్లకుండా మందంగా డంగు సున్నం మిశ్రమాన్ని అద్దుతారు. వాన నీళ్లు పడగానే పక్కలకు జారి పోయేందుకు ఏటవాలు ఉండేలా దాన్ని పూస్తారు. ఆ పూత చాలా గోడలపై ఊడిపోయింది. అక్కడి నుంచి వాననీళ్లు లోనికి చేరుతున్నట్టు గుర్తించారు. ఇప్పుడు మళ్లీ పైభాగంలో పూత వేయాల్సి ఉంది.
మజ్నూ బురుజు మూడొంతులు మళ్లీ కట్టాల్సిందే..
నయాఖిల్లాలో కూలిపోయిన మజ్నూ బురుజు మరోవైపు పావు భాగం పదిలంగానే ఉందని గుర్తించారు. మూడొంతుల భాగాన్ని పూర్తిగా తొలగించి మళ్లీ మట్టి నింపి కట్టాల్సి ఉంది. పునర్నిర్మాణంలో మాత్రం డంగు సున్నం మిశ్రమాన్ని వాడుతూ నిర్మించాలని నిర్ణయించారు. దాని పునాది భాగం వరకు పాత నిర్మాణాన్ని తొలగించి పునాదిని పటిష్టం చేసి కట్టనున్నారు.
భారీ బడ్జెట్ అవసరం..
గోల్కొండ గోడల మరమ్మతులకు భారీగా వ్యయం అవుతుంది. దాన్ని తేల్చే డీపీఆర్ రూపొందించి కేంద్రానికి పంపి నిధులు తెప్పించుకోవాల్సి ఉంది. ఈ పనులు పూర్తి కావటానికి కనీసం ఐదేళ్లు పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే వానాకాలంలోపు.. ప్రమాదకరంగా ఉన్న గోడలకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.
ఎడబాసిన లైలా–మజ్నూలు..
నయాఖిల్లాల్లో ఒకదాని పక్కన ఒకటిగా రెండు బురుజులున్నాయి. అమరప్రేమికులుగా చరిత్రలో నిలిచిన లైలా–మజ్నూల పేర్లను వీటికి పెట్టారు. ఇప్పుడు ఇందులో మజ్నూ బురుజు కూలిపోవటంతో వాటి మధ్య ఎడబాటు వచ్చినట్టయింది.
డంగు సున్నంమిశ్రమం ఇలా..
అలనాటి నిర్మాణాల్లో డంగుసున్నం మిశ్రమందే కీలకపాత్ర. అందులో డంగు సున్నం, రాతిపొడి, గుడ్డు సొన, కరక్కాయ, నల్లబెల్లం కలిపి చాలా మెత్తని మిశ్రమాన్ని రూపొందిస్తారు. ఆధునిక నిర్మాణాల్లో సిమెంట్ పాత్రను ఇది పోషిస్తుంది. మిశ్రమం తయారీకి ముందు 21 రోజుల పాటు కరక్కాయలను నానబెడతారు. ఇప్పుడు గోల్కొండలో కూలిన భాగాల పునర్నిర్మాణంలో దీన్నే వినియోగించనున్నారు. ముందు ఉన్న రూపును అచ్చంగా తిరిగి తీసుకొస్తారు.
ఇంటర్‌లాకింగ్ నిర్మాణం..
అప్పట్లో నిర్మాణ ఇంజనీరింగ్‌లో ఇంటర్‌లాకింగ్ రాతి కట్టడాలు ప్రత్యేకంగా ఉంటాయి. రాతికి గ్రూవ్స్ తరహాలో సందులు చేసి, పైరాయి అందులో కూర్చునేలా రూపొందిస్తారు. గోల్కొండ కోటలో ప్రాకారాల్లో రాళ్లను ఇలాగే నిలిపారు. ఇక్కడ పూర్తిస్థాయి ఇంటర్ లాకింగ్ టెక్నిక్ కాకుండా రాళ్లు జారిపోకుండా కాస్త వాలు, కాస్త ఎత్తుగా ఉండేలా కోసి మరో రాయి అందులో పేర్చి నిర్మించారు. ఆ క్రమంలో రాళ్ల మధ్య చెట్ల గోందు(గమ్)లాంటిది పూసి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు అలా పునర్నిర్మాణం సాధ్యం కానందున, రాళ్ల మధ్య బైండింగ్ కోసం డంగు సున్నం మిశ్రమాన్ని వాడబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment