
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనే మంత్రులు, అధికారులు భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, కేంద్రం నిర్దేశించిన మేరకే జనం హాజరయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం ఇటీవల ఆదేశించింది. కరోనా నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం విచారించింది. మంత్రులు, అధికారులు ఎక్కడా భౌతిక దూరం పాటించడం లేదని, కేంద్ర నిబంధనలకు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా వందలాది మంది ఆయా సమావేశాల్లో పాల్గొంటున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ నివేదించారు. ఈ మేరకు 120కి పైగా వీడియోలను ఆధారాలుగా సమర్పిస్తానని తెలిపారు. కేంద్రం మార్గదర్శకాలు పాటించకపోవడంతో కరోనా వ్యాప్తి చెందుతోందని, మంత్రులు, అధికారులు ఇప్పటికైనా ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment