మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్ట్‌పై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబుకు హైకోర్టులో ఎలాంటి ఊరట దక్కలేదు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘మైక్‌తో దాడి చేసి గాయపరిచారన్నది ఆరోపణ. అనుమతి లేకుండా మోహన్‌బాబు ఇంట్లోకి వెళ్లిన కారణంగానే ఘటన జరిగింది. తొలుత బీఎన్‌ఎస్ 118 సెక్షన్ కింద కేసు పెట్టిన పోలీసులు జర్నలిస్ట్ రంజిత్ వాంగ్మూలం తీసుకుని సెక్షన్ 109గా మార్చారు. మోహన్‌బాబు, రంజిత్ మధ్య ఎలాంటి వివాదం లేదు.
హత్యకు ప్రయత్నించారనడానికి ఎలాంటి కారణాలు లేవు. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు పిటిషనర్ బెయిల్‌కు అర్హుడు’అని పేర్కొన్నారు. మనోజ్ జిమ్ ట్రైనర్‌తోపాటు మరొకరి స్టేట్‌మెంట్ రికార్డు చేశామని ఏపీపీ జితేందర్‌రావు చెప్పారు. కౌంటర్ కూడా దాఖలు చేశామన్నారు. మోహన్‌బాబు కావాలని చేయకున్నా.. తెలిసి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.
‘రంజిత్‌కు తగిలిన గాయంపై ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా సెక్షన్‌ను మార్చాల్సి వచ్చింది. వారంపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. 20 రోజుల వరకు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పారు. పిటిషనర్ కుమారుడి ఆహ్వనం మేరకు మీడియా ప్రతినిధులు వెళ్లారు. మోహన్‌బాబు దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. ఆయనకు జీవితకాల శిక్ష పడే అవకాశం కూడా ఉంది’అని చెప్పారు.
అయితే మోహన్‌బాబు దుబాయ్ వెళ్లడం లేదని రవిచందర్ పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇరు పార్టీలను అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రవిచందర్ కోరగా, నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment