సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా విశిష్టమైన చరిత్ర కలిగి ఉన్న బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికింది. రూ. 18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ ఈసారి వేలం పాటలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. చివరిసారి 2019లో కొలను రామిరెడ్డి 17లక్షల 67వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకోగా ఈ ఏడాది అంతకంటే ఎక్కవ ధర పలికింది.
గత 26 ఏళ్లుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా బాలాపూర్ గణేష్ లడ్డూవేలం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డూకు పూజలు నిర్వహించిన అనంతరం వేలం పాట ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి, ఇతర రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఈసారి నిర్వహించిన వేలం పాటలో 35 మంది పాల్గొన్నారు.
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్ర
బాలాపూర్ గణేషుడి లడ్డూ ప్రతి ఏడాది 21కిలోల బరువుతో తయారు చేస్తారు. బాలాపూర్ లడ్డూ సంప్రదాయం 1980లో ప్రారంభమవ్వగా.. వేలం మాత్రం 1994లో మొదలైంది. విఘ్నాలు తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఈ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులతోపాలు ప్రముఖులు సైతం పోటీపడతారు.
ప్రతియేటా ఎంతో ఉత్సాహంగా జరిగే ఈ లడ్డూ వేలం పాట గతేడాది కరోనా ప్రభావంతో రద్దు చేశారు. ఉత్సవసమితి సభ్యులు సీఎం కేసీఆర్‌కు ఆ లడ్డూను అందజేశారు. 2019లో బాలాపూర్ లడ్డూ రికార్డుస్థాయిలో 17లక్షల 60 వేల రూపాయలు పలికింది.
నిమజ్జన వేడుకలు
41 ఏళ్ల చరిత్ర కలిగిన బాలాపూర్ గణపతి నిమజ్జన వేడుకలు ఆదివారం తెల్లవారు జామునే ప్రారంభమయ్యాయి. ఉదయం అయిదున్నర గంటలకే ఉత్సవసమితి ఆధ్వర్యంలో చివరిపూజలందుకున్న గణేషుడు ఊరేగింపుకు బయల్దేరారు. బాలాపూర్పుర వీధులగుండా అత్యంత భక్తి శ్రద్ధలతో భజన చేస్తూ.. సన్నాయి మేళాల నడుమ ఊరేగింపు సాగుతోంది. ట్యాంక్‌బండ్ వరకు 17 కిలోమీటర్ల మేరకు శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది.
బాలాపూర్ లడ్డూ వేలంపాటలు
► 1994లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 450
► 1995లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 4,500
►1996లో కొలను కృష్ణారెడ్డి.. రూ. 18,000
►1997లో కొలను కృష్ణారెడ్డి... రూ. 28,000
►1998లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 51,000
►1999లో కల్లెం ప్రతాప్‌రెడ్డి.. రూ. 65,000
►2000లో కల్లెం అంజిరెడ్డి.. రూ.66,000
►2001లో రఘునందన్‌చారి.. రూ. 85,000
►2002లో కందాడ మాధవరెడ్డి.. రూ.1,05,000
►2003లో చిగిరింత బాల్‌రెడ్డి.. రూ.1,55,000
►2004లో కొలను మోహన్‌రెడ్డి...రూ. 2,01,000
►2005లో ఇబ్రహీం శేఖర్... రూ.2,80,000
►2006లో చిగిరింత శేఖర్‌రెడ్డి..రూ.3,00,000
►2007లో రఘునందర్‌చారి.. రూ.4,15,000
►2008లో కొలను మోహన్‌రెడ్డి... రూ.5,07,000
►2009లో సరిత రూ.5,15,000
►2010లో కొడాలి శ్రీధర్‌బాబు..రూ.5,25,000
►2011లో కొలను బ్రదర్స్... రూ. 5,45,000
►2012లో పన్నాల గోవర్థన్‌రెడ్డి... రూ.7,50,000
►2013లో తీగల కృష్ణారెడ్డి... రూ.9,26,000
►2014లో సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి...రూ.9,50,000
►2015లో కొలను మదన్ మోహన్‌రెడ్డి... రూ.10,32,000
►2016లో స్కైలాబ్‌రెడ్డి... రూ.14,65,000
►2017లో నాగం తిరుపతిరెడ్డి... రూ.15,60,000
►2018లో శ్రీనివాస్‌గుప్తా.. రూ.16,60,000
►2019లో కొలను రామిరెడ్డి... రూ.17,60,000
►2020 ---- ----
►2021లో మర్రి శశాంక్‌రెడ్డి... రూ. 18,90,000
Comments
Please login to add a commentAdd a comment