సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సర్కారీ ఆస్తుల అమ్మకాలకు హెచ్‌ఎండీఏ మరోసారి సన్నాహాలు చేపట్టింది. సుమారు రూ.5 వేల కోట్లు సమకూర్చుకోవడమే లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లోని స్థలాలు, ఫ్లాట్లను విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఎయిర్‌పోర్టు మార్గంలో ఉన్న బుద్వేల్‌లో భారీ లేఅవుట్ పనులు వేగంగా కొనసాగుతుండగా.. కోకాపేటలో రెండో దశ, ఉప్పల్ భగాయత్‌లో మూడో దశ ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు కార్యాచరణ చేపట్టింది. మరోవైపు పోచారంలో ఏడంతస్తుల చొప్పున ఉన్న రెండు రాజీవ్ స్వగృహ టవర్లను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రెండు టవర్లలో కలిపి 142 ఫ్లాట్లు ఉన్నాయి.
అందరిచూపు బుద్వేల్ వైపే..
ఐటీ సంస్థలు మొదలుకొని మధ్యతరగతి వరకు ఇప్పుడు అందరిచూపు బుద్వేల్ వైపు పడింది. విమానాశ్రయం మార్గంలో ఉండటంతో సంపన్న, ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా బుద్వేల్ హెచ్‌ఎండీఏ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇక్కడ సుమారు 182 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రీన్‌ఫీల్డ్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అధికారులు రూ.200 కోట్లతో పనులు ప్రారంభించారు. ఒక్కో ప్లాట్ విస్తీర్ణం 6.13 ఎకరాల నుంచి 14.58 ఎకరాల వరకు ఉంటుందని అంచనా. తొలివిడత ఇక్కడ 50 ఎకరాల్లో విక్రయాలు చేపట్టనున్నారు. బహుళ ప్రయోజనాల జోన్‌గా ఈ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. అంటే కార్యాలయ సముదాయాలు, నివాసాలు, రిటైల్, ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్‌కేర్ వంటివి అభివృద్ధి చెందడానికి ఆస్కారముంది. వేలం ద్వారా ప్లాట్లను కొనుగోలు చేసేవారికి మూడు వారాల్లో నిర్మాణ అనుమతులన్నీ మంజూరు చేయనున్నారు. ఈ భూముల విక్రయాల ద్వారా కనీసం రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు.
కోకాపేటలో 64 ఎకరాలకు..
కోకాపేట నియో పోలీస్ లేఅవుట్‌లో రెండో దశ ప్లాట్ల విక్రయానికి అధికారులు సన్నాహాలు చేపట్టారు. 2021 జూలైలో నిర్వహించిన మొదటి దశ వేలంలో సుమారు 49 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 8 ప్లాట్లను విక్రయించారు. ఎకరానికి రూ.25 కోట్ల చొప్పున కనీస ధర నిర్ణయించినా.. అనూహ్యమైన పోటీతో ఎకరానికి కనిష్టంగా రూ.40.05 కోట్ల నుంచి గరిష్టంగా రూ.60 కోట్ల వరకు ధర పలికింది. ఇప్పుడు కోకాపేట నియో పోలీస్ ప్రాంతంలోనే 64 ఎకరాలను విక్రయించనున్నారు. రూ.2,500 కోట్లకుపైగా రావొచ్చని అంచనా వేస్తున్నారు.
ఉప్పల్ భగాయత్‌లో మూడో దశ..
ఉప్పల్ భగాయత్‌లో ఇప్పటికే రెండుసార్లు హెచ్‌ఎండీఏ ప్లాట్లను విక్రయించారు. మెట్రోస్టేషన్‌కు అందుబాటులో ఉన్న ఈ స్థలాలకు బాగా డిమాండ్ ఉంది. ఇక్కడ మొత్తం 450 ఎకరాల్లో లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. మొదటి, రెండో దశలో ప్లాట్లను కొనుగోలు చేసినవారు పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు చేపట్టారు. 2021 డిసెంబర్‌లో జరిగిన వేలంలో చదరపు గజానికి కనిష్టంగా రూ.75 వేల నుంచి గరిష్టంగా రూ.లక్ష వరకు పలికింది. ప్రస్తుతం మూడో దశలో 40 ఎకరాలను విక్రయిస్తామని, రూ.650 కోట్లకు పైగా రావచ్చని అధికారులు చెప్తున్నారు.
ఇది కూడా చదవండి: వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు
Comments
Please login to add a commentAdd a comment