![Honey Bees Attacked On Mla Rajaiah - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/14/444.jpg.webp?itok=is9Dbs_T)
తేనెటీగలు లేవడంతో పరుగులు పెడుతున్న స్థానికులు
వరంగల్ : ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రేణుక ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు లేచిన సంఘటన మండలంలోని ఉప్పుగల్లులో సోమవారం చోటు చేసుకుంది. గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామ చివర ఆలయాన్ని నిర్మించడంతో పాటు రేణుక ఎల్లమ్మ తల్లిని ప్రతిష్ఠించారు. గౌడ కులస్తులు అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించడంతో వేడుకల్లో ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజయ్య నెత్తిన బోనం ఎత్తుకొని గుడిచుట్టూ ప్రదక్షణలు చేశారు.
(చదవండి : సర్పంచ్ నవ్యపై వేధింపులతో మరోసారి తెరపైకి)
అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి పూజలు నిర్వహిస్తుండగా అప్పటికే మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో వచ్చారు. గుడి పక్కన రావిచెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున లేవడంతో గమనించిన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇదే సమయంలో ఆలయం లోపలి నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఒక్కసారిగా అప్రమత్తమై తేనెటీగల బారిన పడకుండా వెంటనే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది సేపు ఆలయం వద్ద ఆందోళనకు గురైన స్థానికులు తేనెటీగలు పెద్దగా దాడి చేయకపోవడంతో అందరు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment