సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్‌ఎంసీ అధికారులు గురువారం తొలగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నారు. సిటీ ట్రాఫిక్ చీఫ్ జి.సుదీర్‌బాబు సైతం ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఒకట్రెండు రోజుల్లో ఆ రోడ్డును పూర్తిస్థాయిలో వాహన చోదకుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మొదలు..
బేగంపేటలోని గ్రీన్‌లాండ్స్ చౌరస్తా సమీపంలో చాలా ఏళ్లుగా ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్ ఆఫీస్ కొనసాగుతున్నాయి. వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో అక్కడ ముఖ్యమంత్రి నివాసం నిర్మితమైంది. ఆయన అందులో బస చేసినప్పుడు రహదారిపై ఎలాంటి అడ్డంకులు ఉండేవి కాదు. కేవలం సీఎం నివాసంలోకి ప్రవేశించడానికే అనుమతులు అవసరమయ్యేవి.
అయితే నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక అప్పటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తొలిసారిగా ఆ రహదారిలో బారికేడ్లు వెలిశాయి. తొలినాళ్లలో తాత్కాలికంగా 8 అడుగుల ఎత్తున వాటిని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ప్రగతి భవన్ నిర్మించిన తర్వాత రోడ్డుపైకి ఇనుప గ్రిల్స్ వచ్చాయి. వాటి ప్రభావంతో బేగంపేట మార్గంలో పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడేవి.
సీఎం రేవంత్ ఆదేశంతో...
మంగళవారం తనను ముఖ్యమంత్రిగా ప్రకటించిన వెంటనే మాట్లాడిన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తున్నట్లు, అక్కడే ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నుంచి ప్రజాదర్బార్ ప్రారంభం కానుండటంతో అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు అడ్డంకులు తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు గురువారం ఉదయం నుంచి అవసరమైన చర్యలు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment