సాక్షి, హైదరాబాద్: దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. రాజమౌళి డెరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీలో.. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్‌తో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా.. ఎట్టకేలకు ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం శనివారం ఓ జీవో విడుదల చేసింది.
తాజా జీవో ప్రకారం.. సాధారణ థియేటర్లలో మొదటి మూడు రోజులకు రూ. 50 పెంపు, తర్వాత వారం రోజులకు రూ. 30 పెంచుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక, మల్టీప్లెక్స్, ఐమాక్స్‌లో మొదటి మూడు రోజులకు రూ. 100 పెంపు, తర్వాత వారం రోజులు రూ. 50 పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మార్చి 25 నుంచి 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు తెలంగాణ సర్కార్ అనుమతిని ఇస్తున్నట్లు ప్రకటించింది.
అంతకుముందు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హై బడ్జెట్ సినిమా కావడంతో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సినిమా టికెట్‌పై మరో రూ. 75 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి 10 రోజులు ఈ పెంపునకు అనుమతి ఇచ్చింది. కాగా, రూ. 336 కోట్లతో సినిమా నిర్మించినట్లు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిశీలించిన తర్వాత టికెట్ రేట్ల పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment