![HYD: Auto Driver Throws Passenger Out Money Transfers To His Account - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/26/auto-driver.jpg.webp?itok=zG70VIo5)
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుడిని ఆటోలోంచి తోసేసిన ఓ ఆటో డ్రైవర్ సదరు వ్యక్తి సెల్‌ఫోన్ నుంచి గూగుల్ పే ద్వారా రూ. 57 వేల నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న ఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్‌కు చెందిన పి.వీరప్రతాప్ సింగరేణి ఉద్యోగి. ఈ నెల 23వ తేదీన ఈఎస్‌ఐ ఆసుపత్రికి వచ్చిన అతను అర్జెంట్‌గా మంచిర్యాల వెళ్లే క్రమంలో తెల్లవారు జామున 4:25కు ఈఎస్‌ఐ వద్ద సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కాడు.
ఆటో పంజగుట్ట కూడలికి చేరుకోగానే ఆటోడ్రైవర్ వీరప్రతాప్‌ను ఆటోలోనుంచి బలవంతంగా బయటకు నెట్టివేసి ఆటో తీసుకుని బంజారాహిల్స్ వైపు వేగంగా వెళ్లిపోయాడు. వీరప్రతాప్ తేరుకుని కొద్దిసేపు తర్వాత చూసుకోగా అతని సెల్‌ఫోన్ కనిపించలేదు. అర్జెంట్‌గా ఊరు వెళ్లే క్రమంలో అతను మంచిర్యాలకు వెళ్లిపోయాడు. అక్కడ ఎటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసేందుకు చూడగా నో బ్యాలెన్స్ చూపించింది.
దీంతో మంచిర్యాల యాక్సిస్ బ్యాంకులో సంప్రదించగా తన అకౌంట్ నుండి గూగుల్ పే ద్వారా 57362 రూపాయలు బదిలీ అయినట్లు నిర్ధారించారు. దీంతో తిరిగి నగరానికి వచ్చిన వీరప్రతాప్ శుక్రవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: శంషాబాద్‌లో కొత్త అంతర్జాతీయ టెర్మినల్.. 28 నుంచి కార్యకలాపాలు
Comments
Please login to add a commentAdd a comment