ఆటో డ్రైవర్ మహ్మద్ హబీబ్‌ను సత్కరిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి చిరుద్యోగులు, రోజు కూలీలు, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. లాక్‌డౌన్‌తో అసలు జనాలు భయటకు వెళ్లలేదు. ప్రస్తుతం సడలింపులు ఇచ్చినప్పటికి.. పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. దాంతో రోజు గడవడం.. వాహనాల ఈఎమ్‌ఐలు, రోజు వారి అద్దెలు గడవడం గగనంగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఓ ఆటోడ్రైవర్ తన నిజాయతీని కోల్పోలేదు. రోజుకు మూడు వందల రూపాయలు సంపాదించడమే కష్టంగా ఉన్న తరణంలో తన ఆటోలో అతడికి సుమారు లక్షన్నర రూపాయల సొమ్ము దొరికింది. కానీ అతడు దానిలో ఒక్క రూపాయి ముట్టుకోకుండా పోలీసులకు అప్పగించి నిజాయతీని చాటుకున్నాడు. (ఉపాధి ఊడుతోంది!)
వివరాలు.. మహ్మద్ హబీబ్ నగరంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కరోనా ముందు వరకు ఆటో మీద బాగానే సంపాదించేవాడు. కానీ లాక్‌డౌన్‌తో కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రోజుకు కేవలం మూడువందల రూపాయలు మాత్రమే సంపాదించగల్గుతున్నాడు. దానిలో 250 రూపాయలు ఆటో అద్దెకు పోతుంది. మిగిలిన 50 రూపాయలతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మహ్మద్ హబీబ్ ఆటోలో ఇద్దరు మహిళలు ఎక్కారు. సిద్దంబర్ బజారు ప్రాంతంలో దిగారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో మహ్మద్ తాడబన్ ప్రాంతానికి చేరుకున్నాడు. వాటర్ బాటిల్ కోసం ప్యాసింజర్ సీటులో వెతికాడు. అతడికి ఓ బ్యాగ్ కనిపించింది. అది చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఏ బాంబో ఉంటే ఎంటి పరిస్థితి అనుకున్నాడు. (నెల రోజుల తర్వాత కాస్త రిలీఫ్..)
ఇంతలో మహ్మద్‌కి సిద్దంబర్ బజార్ ప్రాంతంలో దిగిన మహిళలు గుర్తుకు వచ్చారు. ఈ బ్యాగ్ వారిదే అయ్యుంటుందని భావించాడు. అక్కడి వెళ్లి వారి కోసం చూశాడు. కానీ కనిపించలేదు. దాంతో ధైర్యం చేసి బ్యాగ్ ఒపెన్ చేశాడు. దాన్నిండ డబ్బుల కట్టలు ఉన్నాయి. మొత్తం 1.40 లక్షల రూపాయలు ఉన్నాయి. వెంటనే దగ్గరిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. విషయం వారికి చెప్పాడు. ఇంతలో బ్యాగ్ మర్చిపోయిన మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. మహ్మద్ ఆమెను గుర్తు పట్టాడు. అనంతరం బ్యాగ్‌ను ఆమెకు అందించాడు. పోయింది అనుకున్న డబ్బు దొరకడంతో సదరు మహిళ సంతోషించింది. మహ్మద్‌కు కృతజ్ఞతలు తెలపడమే కాక అతడికి ఐదు వేల రూపాయలు బహుమతిగా ఇచ్చింది. పోలీసులు మహ్మద్ నిజాయతీని ప్రశంసించడంతో పాటు అతడికి సన్మానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment