సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16,17 తేదీల్లో పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతర ఉత్సవాలు, సామూహిక ఘటాల ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని నగర ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
దక్షిణ మండలంలోని ఫలక్‌నుమా, చార్మినార్, మీర్‌చౌక్, బహదూర్‌పురా ట్రాఫిక్ పోలస్‌స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నందున వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లింపు ఉంటుందన్నారు. ఈ నెల 16 నుంచి 17వ తేదీ రాత్రి 11 గంటల వరకు దారి మళ్లింపులు ఉంటాయన్నారు.
చదవండి: తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్
ఆషాఢ మాసం బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. పాతబస్తీతో సిటీ వ్యాప్తంగా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ మేళాలు.. పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. భక్తుల భావోద్వేగాల మధ్య బోనాల జాతర ఆద్యంతం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంటోంది. గత నెల 22న గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించిన బోనంతో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా ఈ నెల 7న పాతబస్తీలోని చారిత్రాత్మక పురాతన దేవాలయాల అమ్మవార్లకు కలశ స్థాపన, అభిషేకం, అలంకరణ, నైవేద్యం, తీర్థ ప్రసాదాలతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 9న అమ్మవారి ఘటస్థాపన సామూహిక ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఘటస్థాపన అనంతరం వరుసగా ప్రతిరోజూ పూజలు నిర్వహించిన భక్తులు.. నేడు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. సోమవారం పాతబస్తీ ప్రధాన వీధుల్లో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment