సాక్షి, హైదరాబాద్: గార్లిక్ బ్రెడ్–రూ.160, దోశ–రూ.250, ఫ్రూట్ సలాడ్–రూ.300, సీఫుడ్ సూప్–రూ.320.. ఎడ్విన్ కేసులో అరెస్టు అయిన డ్రగ్ పెడ్లర్ బాలమురుగన్‌కు చెందిన మోర్గన్స్ ప్లేస్ రెస్టారెంట్ మెనూ ఇది. అక్కడకు వెళ్లిన ఎవరైనా ఇంత రేటా..? అంటే.. అంతా విలువ ఉంటుందని చెప్తుంటారు నిర్వాహకులు. బాలమురుగన్ సరఫరా చేసే చెరస్ కూడా ఇలానే ఎక్కువ రేటు ఉంటుందని, ఎందుకంటే అతడి నుంచీ అదే సమాధానం వస్తుందని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు చెప్తున్నారు.
దీనికి అతడి నుంచి వచ్చే సమాధానం వర్తీ స్టఫ్ సార్ అని. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీ పర్వత ప్రాంతాల్లో అది పండటమే కారణం. తదుపరి విచారణ నిమిత్తం బాలమురుగన్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రామ్‌గోపాల్ పేట పోలీసులు నాంపల్లి కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.
తులాల లెక్కన విక్రయం...
హోటళ్ల వ్యాపారం చేసే బాలమురుగన్‌కు రాజస్థాన్‌లోని కోట, బుండి, పుష్కర్‌లతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌లోని ధరమ్‌కోట్, గోవాలోని అంజునా బీచ్‌ల్లో మోర్గన్స్ ప్లేస్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. అనునిత్యం రద్దీగా ఉండే వీటిలో నాణ్యమైన ఆహారం అందిస్తున్న నేపథ్యంలోనే రేటు సైతం ఎక్కువని మురుగన్ ప్రచారం చేసుకుంటాడు.
అతడు సరఫరా చేసే చెరస్ విషయంలోనూ ఇదే సూత్రం అవలంబిస్తున్నాడు. మనాలీలో దొరికే గంజాయి ఆకులు, పుష్పాల నుంచి తీసే ఈ జిగురు లాంటి పదార్థాన్ని అతగాడు కేజీల్లో ఖరీదు చేస్తున్నాడు. దాన్ని గోవా సహా ఐదు రాష్ట్రాలకు సరఫరా చేస్తూ తులాల లెక్కన అమ్ముతున్నాడు. ఒక్కో తులం పెడ్లర్లకు రూ.5 వేలకు అమ్ముతుండగా అది వినియోగదారుడి వద్దకు చేరేసరికి రూ.10 వేలు దాటుతోంది.
యాపిల్ బాక్సులు ఆర్డర్ ఇస్తూ...
తన హోటల్స్ నిర్వహణ బాధ్యతల్లో భాగంగా బాలమురుగన్ అనునిత్యం గోవా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌ల మధ్య చక్కర్లు కొడుతూ ఉంటాడు. గతంలో మనాలీ నుంచి ఇతగాడే చెరస్‌ను రవాణా చేసేవాడు. కూరగాయల మధ్యలో కేజీ చొప్పున ప్యాక్ చేసిన చెరస్ పెట్టి తీసుకువచ్చేవాడు. అయితే గడిచిన రెండుమూడేళ్లుగా నిఘా పెరిగిపోయింది. దీంతో ఇతగాడు యాపిల్స్ మార్గం అనుసరిస్తున్నాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హోల్‌సేల్ యాపిల్ వ్యాపారుల నుంచి తన హోటల్ కోసమంటూ 10, 15 బాక్సులు ఆర్డర్ ఇచ్చేవాడు.
వాటిని ప్యాక్ చేసే వారిని మ్యానేజ్ చేయడం ద్వారా ఒక్కో దాంట్లో కేజీ చొప్పున చెరస్ ప్యాకెట్లు పెట్టించేవాడు. ఈ బాక్సులపై ప్రత్యేక గుర్తులు పెట్టి మిగిలిన వాటిలో కలిపేసేవాళ్లు. ఈ పార్శిల్స్ గోవా వచ్చిన తర్వాత తొలుత తనకే సమాచారం ఇచ్చేలా ట్రాన్స్‌పోర్టు వ్యాపారులనూ మేనేజ్ చేసేవాడు. అలా వారి వద్దకు వెళ్లి ప్రత్యేక గుర్తులతో ఉన్న బాక్సులు తీసుకువెళ్లేవాడు. తాము సహకరిస్తున్నది చెరస్ రవాణాకని అటు హిమాచల్, ఇటు గోవాలో ఉన్న వారికీ తెలిసేది కాదు. గోవా నుంచి ఇతర రాష్ట్రాల్లోని పెడ్లర్స్‌కు హోల్‌సేల్‌గా సరఫరా చేసేవాడు.
మురుగన్‌కు మరికొందరు పెడ్లర్స్...
ఏళ్లుగా చెరస్, కొకైన్ వ్యాపారం చేస్తున్న బాలమురుగన్‌కు నగరంలోనూ కొందరు పెడ్లర్స్ ఉంటారని పోలీసు విభాగం అనుమానిస్తోంది. వారి వివరాలు గుర్తించడానికి లోతుగా విచారించాలని నిర్ణయించింది. దీనికోసం వారం రోజుల పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో రామ్‌గోపాల్‌పేట పోలీసులు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం తుది నిర్ణయం
తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment