
గోల్కొండ: నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఆదివారం ఆయన గోల్కొండ కోటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులతో కలిసి బోనాల బందోబస్తును పర్యవేక్షించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ కార్వాన్ నియోజకవర్గ ఇంచార్జ్ టి.జీవన్ సింగ్ ఆయనకు శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వివిధ వర్గాల పండుగలు ఒకే రోజు రావడంతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లిందని ఆయన అన్నారు. వివిధ వర్గాల ప్రజలు ఒకరినొకరు అభినందించుకుంటూ స్నేహపూరితమైన వాతావరణంలో పండుగలు నిర్వహించుకుంటున్నారు. కోట బోనాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్, నగర అదనపు కమిషనర్ ఎ.ఆర్. శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులు గోవింద్ రాజ్, మైత్రి కమిటీ సభ్యులు ఆబెద్, ఇలియాస్ అక్బర్, జంగయ్య తదితరులున్నారు.