
రంగారెడ్డి: పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా కె.సతీశ్ బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు గడవక ముందే భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. 2004 బ్యాచ్‌కు చెందిన సతీశ్ 2023 జూన్ 14న పహాడీషరీఫ్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఆరు మాసాల్లో స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల అంశం, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలోనే కొనసాగింది. కానీ అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నేతకు సంబంధించిన భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణల నేపథ్యంలో రాచకొండ సీపీ విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. ఈ వివాదంలో ఇన్‌స్పెక్టర్ మాత్రమే ఉన్నారా...? మరెవరైనా ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారా అని స్థానికంగా చర్చలు సాగుతున్నాయి.
ఏడాది గడవకుండానే..
రెండు నుంచి మూడేళ్లపాటు విధులు నిర్వహించాల్సిన ఎస్‌ఎహెచ్‌ఓలు పహాడీషరీఫ్ పీఎస్‌లో మాత్రం ఏడాది కూడా పనిచేయడం లేదు. రకరకాల కారణాలతో బదిలీలు, సస్పెండ్ అవుతున్నారు.
►2020 జూలై 23న సీఐగా బాధ్యతలు చేపట్టిన విష్ణువర్ధన్‌రెడ్డి ఏడాది తిరగకుండానే 2021 జూలై 15న అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు.
►2021 ఆగస్టు 4న బాధ్యతలు చేపట్టిన సి.వెంకటేశ్వర్లు 14 నెలలు పనిచేసి 2022 అక్టోబర్ 4న అకస్మాత్తుగా బదిలీ అయ్యారు.
► అక్టోబర్‌లో బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ 2023 మార్చిలో రాజకీయ ఫిర్యాదులతో బదిలీ అయ్యారు. మూడు నెలల పాటు డీఐ కాశీ విశ్వనాథ్ ఇన్‌చార్జి ఎస్‌హెచ్‌ఓగా కొనసాగారు.
► 2023 జూన్ 14న బాధ్యతలు చేపట్టిన సతీశ్ ఆరు నెలలు గడవక ముందే భూ వివాదం ఆరోపణలతో 2024 జనవరి 7న సస్పెండ్ అయ్యారు.
స్నేక్ గ్యాంగ్ ఉదంతం నుంచి
స్నేక్ గ్యాంగ్ లాంటి ఉదంతంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిన పహాడీషరీఫ్ పీఎస్‌పై పోలీసు ఉన్నతాధికారుల ప్రత్యేక నిఘా ఉంటుంది. ఒకవైపు హత్యలు, హత్యాయత్నాల లాంటి నేరాలకు ఆస్కారం ఉండడం.. ఆపై నగర శివారు కావడంతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతున్న ఈ ఠాణా పరిధిలో విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదే. పై స్థాయి అధికారుల ఆదేశాల కోసం భూ వివాదాలలో తలదూర్చి స్థానిక పోలీసులు తమ మెడకు చుట్టుకున్న సందర్భాలు సైతం గతంలో వెలుగు చూశాయి. ఏదేమైనా తరచూ ఎస్‌హెచ్‌ఓలు మారుతుండడంతో నేరాల నివారణ, ఈ ప్రాంతంపై పట్టు సాధించడం కొత్తగా వచ్చిన అధికారులకు ఇబ్బందికరంగా మారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment