కబ్జా.. కబ్జా.. కబ్జా.. మేడ్చల్ జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఈ పదం వింటూనే ఉన్నారు. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు.. బాధితుల నుంచి లెక్కకుమించిన వినతులు.. నిత్యం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా కబ్జాదారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ స్థలాలను హ్యాపీగా కబ్జా చేసేసి.. అక్రమంగా నిర్మాణాలు చేసేసి.. పేద, మధ్యతరగతి ప్రజలకు అంటగడుతూ కోట్లకు పడగెత్తుతున్నారు. పల్లె, పట్టణ ప్రగతి, సమీక్ష, సమావేశాలతో అధికారులు బిజీగా ఉండటంతో ఇదే అదనుగా పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై యంత్రాంగం సీరియస్ గా దృష్టి సారించింది. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
సాక్షి,సిటీబ్యూరో: పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అలాంటి వారిపై చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఎల్‌ఆర్‌ఎస్‌లో భాగంగా అందిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని తెప్పించుకున్న యంత్రాంగం ఇంకా అదనపు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అక్రమ కట్టడాలు, లేఅవుట్లు, రోడ్లు, పార్కులను కబ్జా చేసి నిర్మిస్తున్న భవనాలు, బహుళ అంతస్తులు, ఇండిపెండెంట్ ఇళ్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కొందరు ఉద్యోగులు, సిబ్బంది తీరుపై సీరియస్‌గా ఉన్న యంత్రాంగం ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లను రంగంలోకి దింపాలని భావిస్తోంది.
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి..
బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడ్చల్, జవహర్‌నగర్, నిజాంపేట్, కొంపల్లి, దుండిగల్, తూముకుంట, దమ్మాయిగూడ, నాగారం, ఘట్‌కేసర్, పోచారం, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ఈ కట్టడాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా పడుతున్న గండిని నివారించి.. స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికార యంత్రాంగం దృష్టిసారిస్తోంది. కొంతమంది ఉద్యోగులు, సిబ్బందికి అక్రమ కట్టడాల పర్వాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ అక్రమ కట్టడాలపై ఇన్‌చార్జ్ కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందుతుండటంతో.. చర్యలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లను వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
గుర్తించిన అక్రమ కట్టడాలివే..
మేడ్చల్ జిల్లాలో పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల్లో గుర్తించిన అక్రమ కట్టడాలు, లేఅవుట్లు, 3,643 ఉండగా, ఘట్‌కేసర్ మండలంలో 656, దుండిగల్‌లో 1,950, కీసరలో 650, శామీర్‌పేట్‌లో 191, మేడ్చల్ మండలంలో 196 ఉన్నట్లు తెలుస్తోంది. నాగారం పట్టణంలో 12 అక్రమ లేఅవుట్లు ఉండగా, దమ్మాయిగూడలో 7, మేడ్చల్‌లో 10, నిజాంపేట్‌లో 20, కొంపల్లిలో 11, దుండిగల్‌లో 12, తూముకుంటలో 15, పోచారంలో 12, ఘట్‌కేసర్‌లో 8 ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ ఇటీవల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల సమాచారం ద్వారా బయటపడినట్లు తెలుస్తోంది.
మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో ఇలా..
మేడ్చల్ జిల్లా పరిధిలోని జీహెచ్‌ఎంసీ మున్సిపల్ సర్కిళ్లలోని పార్కులు, రోడ్లు ఆక్రమించి అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. ఉప్పల్ సర్కిల్‌లో 1,989 చదరపు గజాల స్థలం, కాప్రా సర్కిల్‌లో 194 చదరపు గజాల స్థలం, మల్కాజిగిరి సర్కిల్‌లో 36 చదరపు గజాలు, మూసాపేట్‌లో 20, కూకట్‌పల్లిలో 455, కుత్బుల్లాపూర్‌లో 62, గాజులరామారంలో 198, అల్వాల్ సర్కిల్‌లో 155 చదరపు గజాల స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన యంత్రాంగం ఆక్రమణలపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment