సాక్షి, హైదరాబాద్: ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు మంజూరు చేసిన మెడికల్ కాలేజీలు ఎన్నో చెప్పాలి అంటే.. సున్నా’ అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం వైద్యవిద్యలో చరిత్ర లిఖించారని ఆయన పేర్కొన్నారు. 2014కు ముందు తెలంగాణలో 67 ఏళ్లలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటు చేస్తే.. ఎనిమిదేళ్లలో కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయని వివరించారు. జిల్లాకు ఒకటి చొప్పున మరో 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
‘వనపర్తి, రామగుండం, జగిత్యాలలో వైద్య కళాశాలల నిర్మాణాలు పూర్తయ్యాయి. సూర్యాపేట, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ మెడికల్ కాలేజీలు ఇప్పటికే మొదలయ్యాయి. సంగారెడ్డి, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కావొచ్చింది. త్వరలో కొత్తగూడెం మెడికల్ కాలేజీని ప్రారంభిస్తాం‘.. అని ట్వీట్ చేశారు. ఆయా మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఫొటోలను సైతం కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment