సాక్షి, హైదరాబాద్: పేదవిద్యార్థులకు న్యాయవిద్య ఫీజులు భారంగా మారాయి. ఫలితంగా వారు న్యాయవిద్యకు దూరమవుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ మునుపెన్నడూ లేనంతగా ఫీజులు పెంచిందని న్యాయశాస్త్ర విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఐదేళ్ల న్యాయవిద్య కోర్సు వార్షిక ఫీజును రూ.5,460 నుంచి రూ.16 వేలకు పెంచారు.
రెండేళ్ల కాలపరిమితి ఉండే ఎల్‌ఎల్‌ఎం ఫీజును రూ.4,500 నుంచి రూ.20,100కు పెంచారు. ఎంఎల్‌ఎం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులు రెండింతలు పెరిగాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు రూ.15 వేల నుంచి రూ.33,000 పెంచారు. ప్రభుత్వ అధీనంలో ఉండే ఉస్మానియా లా కోర్సుల్లో ఫీజులు ఇప్పుడు ప్రైవేటు కాలేజీలతో సమానంగా ఉన్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫీజుల బెంబేలుతో చేరని విద్యార్థులు
లా కోర్సు చదువుదామనుకున్న విద్యార్థులు భారీ ఫీజుల కారణంగా కాలేజీల్లో చేరడం లేదు. ముఖ్యంగా పేద విద్యార్థులు వెనక్కు తగ్గుతు న్నారు. ఈ విద్యాసంవత్సరం 6,724 సీట్లు అందుబాటులో ఉండగా, 12,301 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అందులో మొదటి విడతలో 5,747 మంది మాత్రమే కౌన్సెలింగ్‌లో సీట్లు పొందారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో 4,064 సీట్లు అందుబాటులో ఉండగా, 3,598 సీట్లు కేటాయించారు. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీలో 1,784 సీట్లకు 1,440 సీట్లు కేటాయించారు. 876 ఎల్‌ఎల్‌ఎం సీట్లకు 709 మంది అభ్యర్థులు సీట్లు పొందారు. గడువు ముగిసే నాటికి దాదాపు వెయ్యి మంది వరకూ కాలేజీల్లో చేరేందుకు ఇష్టపడలేదని అధికారులు చెబుతున్నారు.
ప్రకటన లేకుండానే పెంపు
వర్సిటీ అధికారులు ఇష్టానుసారంగా ఫీజుల పెంచారనే విమర్శలొస్తున్నాయి. కోవిడ్ తర్వాత కాలేజీలకు ఖర్చు పెరిగిందని, ప్రభుత్వం నుంచి ఇందుకు తగ్గట్టుగా నిధులు రావడం లేదని, అందుకే ఫీజులు పెంచాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. లాసెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాత్రమే ఓయూ న్యాయ కళాశాలలో సీట్లు పొందుతారు. ఇప్పుడు సాధారణ ర్యాంకులతో ప్రైవేట్ కాలేజీల్లో చేరినవారు, ఓయూ కళాశాలలో సీట్లు పొందినవారు దాదాపు సమానంగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఉస్మానియా వర్సిటీ న్యాయ కళాశాలల్లో రెగ్యులర్ కోర్సుల ఫీజు పెరగడాన్ని ఓయూ జేఏసీ అధ్యక్షుడు కురవ విజయ్‌కుమార్ ఖండించారు. ఫీజులపెంపు వల్ల ప్రతిభ గల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు న్యాయవిద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన లా కోర్సుల ఫీజులను తగ్గిస్తూ ఓయూ పాలకవర్గం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment