
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) పేరుతో రైస్ మిల్లుల్లో జరుగుతున్న అవకతవకలు, బియ్యం రీ సైక్లింగ్‌పై తక్షణం సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 2014 నుంచి ఇప్పటివరకు సీఎంఆర్ కేటాయింపులు, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు చేసిన సరఫరా, మాయమైన బియ్యం నిల్వలన్నింటిపైనా విచారణ సమగ్రంగా జరగాలని కోరారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి సూత్రధారులుగా ఉన్న టీఆర్‌ఎస్ ముఖ్యులపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెలిపారు. టీఆర్‌ఎస్‌పై ఉత్తుత్తి పోరాటాలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టడం కాదని, తక్షణం బియ్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ చేశారు.
భారీగా అవకతవకలు
రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, ధాన్యా న్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే ప్రక్రియలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ముఖ్యులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల మేర ధాన్యం కుంభకోణానికి పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి లేఖ లో ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 900 మిల్లుల్లో తనిఖీ చేస్తేనే రూ.400 కోట్ల కుంభకోణం బట్టబయలైందని, ఇంత స్పష్టంగా కుంభకోణం జరుగు తున్నట్టు ఆధారాలు కనిపిస్తుంటే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment