సాక్షి, హైదరాబాద్: రాజధానిలో సామూహిక గణేష్ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథులను నిమజ్జనం చేసే పనుల్లో భక్తులు నిమగ్నమయ్యారు. నిమజ్జనోత్సవానికి మూడు కమిషనరేట్ల పోలీసులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ సాక్షితో మాట్లాడారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
రేపు ఉదయం 10 గంటలకు బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. బాలాపూర్ గణేషుడి శోభాయాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు, గణనాథుడు సాగరానికి చేరేందుకు వీలుగా మార్గం రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. బాలాపూర్ నుంచి సౌత్ జోన్ మీదుగా చార్మినార్, ఎంజే మార్కెట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం జరుగుతుందని వెల్లడించారు. మూడు వేల మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటారని అన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 32 భారీ క్రేన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు
చదవండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే
శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 33 చెరువులు, 74 ప్రత్యేక కొలనుల్లో నిమజ్జనం జరగనున్నట్లు రంగనాథ్ తెలిపారు. గణేష్ నిమజ్జానానికి ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. హుస్సేన్ సాగర్‌లో 20 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందన్నారు. సెంట్రల్ జోన్‌లోనే ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని, భక్తులు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.
ఖైరతాబాద్ వినాయకుడు మద్యాహ్నం తర్వాత ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు. ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ రూట్‌లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నామని తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.
రేపు సెలవు
గణేష్ నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం(సెప్టెంబర్ 9) సెలవు ప్రకటించింది. తిరిగి సెప్టెంబర్ 12న వర్కింగ్ డేగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment