Hyderabad Traffic Police Focus On 'No Honking', Silent Zones By Using Acoustic Camera - Sakshi
Sakshi News home page

Hyderabad: మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు.. దేశంలోనే తొలిసారి..

Published Thu, Apr 21 2022 9:51 AM | Last Updated on Thu, Apr 21 2022 3:46 PM

Hyderabad Traffic Police Focus On No Honking, Silent Zones By Using Acoustic Camera - Sakshi

రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో నగరంలో వాహనాల ద్వారా ఏర్పడుతున్న శబ్ధ కాలుష్యాన్ని నిరోధించడంపై సిటీ ట్రాఫిక్‌ విభాగం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాలను సైలెంట్‌ జోన్లుగా ప్రకటించనుంది. వీటిలో నో హాకింగ్‌ విధానాన్ని అమలు చేస్తూ హారన్లు మోగించడం నిషేధించడానికి కసరత్తు చేస్తోంది. వీటిని అతిక్రమించే ఉల్లంఘనులకు గుర్తించి, చర్యలు తీసుకోవడానికి అకోస్టిక్‌ కెమెరాలు వినియోగించనుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఎకోమ్‌ సంస్థకు చెందిన వీటి పనితీరును బుధవారం ట్రాఫిక్‌ చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ కంట్రోల్‌ రూమ్‌ జంక్షన్‌ వద్ద ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ పరిజ్ఞానం దేశంలోనే తొలిసారిగా నగరంలో వాడనున్నారు.
-సాక్షి, హైదరాబాద్‌

మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహనాల హారన్, సైలెన్సర్లు 80 డెసిబుల్స్‌ వరకు శబ్ధం చేయవచ్చు. ఈ పరిమితిని దాటి శబ్ధం చేసే ఫ్యాన్సీ హారన్లు, వాహనాల సైలెన్సర్లపై ఇప్పటికే ఆడియో మీటర్లను వినియోగించి ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే కొందరు వాహన చోదకులు వినియోగిస్తున్న హారన్లు పరిమితికి లోబడి ఉన్నప్పటికీ ఇతరులకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నాయి. ప్రధానంగా జంక్షన్ల వద్ద ఆగి ఉన్నప్పుడు, సిగ్నల్‌ రెడ్‌ లైన్‌ నుంచి గ్రీన్‌ లైట్‌లోకి మారిన వెంటనే హారన్లు మోగిస్తుండటంతో ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని గమనించిన మంత్రి కేటీఆర్‌ నిరోధానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల ట్రాఫిక్‌ వింగ్‌కు ఆదేశాలు ఇచ్చారు.  

జర్మనీ పరిజ్ఞానంతో తయారైన కెమెరాలు... 
హారన్లు, సైలెన్సర్ల ద్వారా శబ్ధకాలుష్యానికి కారణమవుతున్న వాహనాలను గుర్తించే అకోస్టిక్‌ కెమెరాలను ప్రస్తుతం దేశంలోని ఏ పోలీసు విభాగమూ వాడట్లేదు. ఫ్రాన్స్‌కు చెందిన ఎకోమ్‌ కంపెనీ జర్మనీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేసింది. ప్రస్తుతం ఇజ్రాయిల్, చైనా, మలేషియా సహా కొన్ని మూడో ప్రపంచ దేశాల్లో వినియోగంలో ఉంది. వీటి పరితీరును సంస్థ ప్రతినిధి ప్రతీక్‌ ట్రాఫిక్‌ విభాగం అధికారులతో పాటు బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ నిపుణులకు వివరించారు.

చతురస్రాకారంలో ఉండి రెండు చేతులతోనూ పట్టుకుని వినియోగించే ఈ కెమెరా ముందు వైపు మానిటర్, వెనుక వైపు 72 మైక్రోఫోన్లు ఉంటాయి. వీటి సహాయంతో సదరు కెమెరా గరిష్టంగా 20 మీటర్ల దూరంలో ఉన్న వాహనాల నుంచి వెలువడే శబ్ధ కాలుష్యాన్ని గుర్తిస్తుంది. కనిష్టంగా 20 డెసిబుల్స్‌ నుంచి గరిష్టంగా 20 వేల డెసిబుల్స్‌ వరకు వెలువడే శబ్ధాలను గుర్తించి ఈ వాహనం వీడియో, ఫొటో తీస్తుంది. మానిటర్‌లో శబ్ధం వెలువరిస్తున్న వాహనం చుట్టూ ఎర్ర రంగులో వలయం 
కనిపిస్తుంటుంది.  

ఏఎన్‌పీఆర్‌ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం... 
ఎకోమ్‌ సంస్థ బుధవారం డెమో ఇచ్చిన కెమెరా ద్వారా శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న వాహనాన్ని గుర్తించడంతో పాటు అది ఏ స్థాయిలో శబ్ధాన్ని చేస్తోందో తెలుసుకోవచ్చు. ఆపై దీన్ని వాడే ట్రాఫిక్‌ పోలీసులు ఆ వాహనం దగ్గరకు వెళ్లి మాన్యువల్‌గా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది కష్టసాధ్యం, ఇబ్బందికరమని ట్రాఫిక్‌ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకోస్టిక్‌ కెమెరాలను ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ సిస్టంతో (ఏఎన్‌పీఆర్‌) అనుసంధానించాలని నిర్ణయించారు.

ఇలా చేస్తే జంక్షన్లలో ట్రాఫిక్‌ కెమెరాలతో కలిసి ఉండే అకోస్టిక్‌ కెమెరాలు శబ్ధ కాలుష్యానికి కారణమైన వాహనంతో పాటు దాని నంబర్‌ను గుర్తిస్తుంది. ఆ వాహనచోదకుడికి ఈ–చలాన్‌ పంపడంతో పాటు న్యాయస్థానంలో చార్జ్‌షీట్‌ దాఖలు చేయడానికి అవసరమైన ఆధారాలను అందిస్తుంది. ఈ విధానం ప్రస్తుతం ఇజ్రాయిల్‌లో ఉందని, నగరంలో వాడుతున్న ఏఎన్‌పీఆర్‌ వ్యవస్థతో అనుసంధానంపై శుక్రవారం జరగబోయే రెండో దశ సమావేశంలో పూర్తి స్పష్టత ఇస్తామని ఎకోమ్‌ సంస్థ ప్రతినిధి ట్రాఫిక్‌ చీఫ్‌కు తెలిపారు. కాగా ఈ కెమెరా ఖరీదు రూ.13 లక్షలని అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement