సికింద్రాబాద్‌కు చెందిన గిరి డయాబెటిక్ కన్సల్టేషన్ కోసం నగరంలోని ఓ ప్రముఖ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్‌ను కలవడానికి వెళ్లాడు. డాక్టర్‌ను చూడగానే ఆయన్ను ఎక్కడో బాగా చూసినట్టు అనిపించింది. కాసేపటికి గుర్తొచ్చింది. మొహమాటం పడకుండా ‘మీరు ఫలానా వెబ్ సిరీస్‌లో నటించారు కదా డాక్టర్?..’అంటూ అడిగాడు. ఆయన అవునంటూ చిరునవ్వుతో సమాధానమివ్వడంతో సంబరపడి పోయాడు.
గిరి లాంటి అనుభవాన్ని నగరంలో చాలామంది ఎదుర్కొంటున్నారు. సీరియల్స్, వెబ్ సిరీస్‌లు బాగా చూసేవారికి ఇలాంటి వారు ఎక్కడో ఒకచోట తారస పడుతున్నారు. వెబ్ సిరీస్‌లు, సీరియల్స్ రూపంలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న నగరవాసులు, తమలో అప్పటివరకు అంతర్లీనంగా ఉన్న నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు. వీలైతే సినిమాల్లోనూ చాన్స్ కొట్టేస్తున్నారు. మొత్తం మీద ఏ వీధి వెదికినా ఆ వీధిలోనే గలరు యాక్టర్లు అన్నట్టుగా సిటీ మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.
సాక్షి, హైదరాబాద్: గతంలో నటులు అంటే నాటకాలనో, సినిమాలనో కెరీర్‌గా ఎంచుకున్నవారే అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వృత్తిలా కాకుండా హాబీగా నటించేవారి సంఖ్య పెరిగిపోయింది. గత ఐదేళ్ల కాలంలో ఆన్‌లైన్ సరీ్వసుల మాదిరి ఈ హాబీ కూడా ఒక్కసారిగా ఊపందుకుంది. ముఖ్యంగా ఓటీటీ వేదికలు విస్తృతమవడం, పెద్దసంఖ్యలో సీరియల్స్, వెబ్ సిరీస్‌లు రూపుదిద్దుకుంటుండడంతో నటీనటులకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. పాత్రోచితంగా కనిపించే వ్యక్తులకు కాస్తంత శిక్షణ అందిస్తే చాలు పనై పోతోంది. వయసులకు అతీతంగా నగరంలో అనేకమందికి నటన ఓ ప్యాషన్‌గా మారిపోయింది.
ప్రేక్షకాభిరుచిలో మార్పు...
► నటనలో పేరున్నవారు, బాగా తెలిసిన ముఖా లను మాత్రమే కాకుండా కొత్త వారిని కూడా ఆదరించే దిశగా ప్రేక్షకుల అభిరుచుల్లో స్పష్ట మైన మార్పు వచి్చంది. దీంతో నిర్మాతలు కొత్త నటీనటులతో ప్రయోగాలు చేయడానికి గతంలోలా భయపడడం లేదు. అంతేకాకుండా ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగానికి సంబంధించిన పాత్ర లో కాస్త సులభంగా మమేకమ య్యే వీలుంటుంది. కాబట్టి వినూ త్న పద్ధతుల్లో సినిమాలో వైద్యుడిపాత్ర ఉంటే వైద్యుడిని, లాయర్ పాత్రకు లాయ ర్‌ని ఎంచుకుంటున్నారు. సర దాగా ఓ సీన్‌లో చేసేవారు కొందరైతే, ఇంకొందరు ప్రాధాన్యత కలిగిన పాత్రల్లోనూ తమ సత్తా చూపుతున్నారు. దీంతో రంగాలేమైనా తెరంగేట్రం సాధారణ విషయంగా మారిపోయింది.
ఓ గంగవ్వ.. ఇంకో రామ్.. మరో శ్రీనివాస్
నటనపై ఉన్న ఆసక్తి కారణంగా సరదాగా టిక్ టాక్స్‌తో మొదలుపెట్టి రీల్స్, షార్ట్ వీడియోల్లో, సోషల్ మీడియా వేదికలపై కాస్తో కూస్తో పేరు సంపాదించుకున్నవారితో పాటు ఇతరత్రా రంగాల్లో ఉన్నవారు కూడా సీరియల్స్, వెబ్ సిరీస్‌ల్లో నటించేస్తున్నారు. సినిమా తారలుగానూ మారిపోతున్నారు. ఒక యూట్యూబ్ చానెల్ ప్రోగ్రామ్ ద్వారా పేరు తెచ్చుకున్న మారుమూల గ్రామానికి చెందిన గంగవ్వ దీనికో ఉదాహరణ. నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ రామ్... గత కొంత కాలంగా సెలబ్రిటీల కోసం పనిచేస్తూ ఆ రంగంలో పేరొందారు. లుక్స్‌లో టాలీవుడ్ హీరోలకు తీసిపోని రామ్... గత లాక్ డౌన్ టైమ్‌లో దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
‘పచ్చీస్ ’పేరుతో రూపొందించిన ఓ సినిమాలో హీరోగా నటించారు. ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. నిర్మాణ రంగంలో ఉన్న మణికొండకు చెందిన శ్రీనివాస్‌కు కూడా నటనపై మక్కువ ఎక్కువ. కానీ ఎన్నో ఏళ్లపాటు తన అభిరుచిని, తనలోని నటనా కౌశలాన్ని తనలోనే దాచేసుకున్నారు. పిల్లలు పెద్దవాళ్లవడంతో వృత్తికి కాస్త విరామం ఇచ్చారు. సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ఇక నగరంలో స్టోరీ టెల్లింగ్‌కు కేరాఫ్‌గా పేరొందిన దీపా కిరణ్ కూడా ఇటీవల యాంగర్ టేల్స్ అనే ఓటీటీ చిత్రంలో నటించారు. అందులోని నాలుగు పొట్టి కథల్లో ఒకటైన ‘యాన్ ఆఫ్టర్ నూన్ న్యాప్’లో ఆమె కనిపిస్తారు. ఈ ఎక్స్‌పీరియన్స్ తనకు కొత్త అనుభూతిని అందించిందని ఆమె అంటున్నారు.
కేరక్టర్‌కు ఓకే.. కెరీర్‌గా నాట్ ఓకే
ఇలాంటి నటులు వరుస పెట్టి సినిమాలు చేసేయాలనే ఆత్రుత ఏమీ చూపడం లేదు. తమ వృత్తికో, ఉద్యోగానికో ప్రాధాన్యత ఇస్తూనే ‘జస్ట్ ఫర్ ఏ ఛేంజ్’అన్నట్టుగా అడపాదడపా వచి్చన అవకాశాల్ని సది్వనియోగం చేసుకుంటున్నారు. సినిమా అనేది తమకు కేవలం అభిరుచి మాత్రమేనని చాలామంది అంటున్నారు. ‘‘నాట్యం’అనేది నా అభిరుచికి, నా ఆలోచనలకు దగ్గరగా ఉన్న సినిమా కాబట్టి నటించాను. అంతే తప్ప సినిమాల్ని కెరీర్‌గా తీసుకునే ఆలోచన లేదు..’అంటున్నారు సంధ్యారాజు. ప్రముఖ పారిశ్రామికవేత్త సత్యం రామలింగరాజు కుటుంబ సభ్యురాలైన ఈ సంప్రదాయ నృత్య కారిణి... ఇటీవలే నాట్యం అనే సినిమాలో కథానాయికగా నటించారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. అయినప్పటికీ ఆమె మరో చిత్రంలో నటించలేదు. అదే విధంగా నగరానికి చెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆకెళ్ల రాఘవేంద్ర కూడా ఒకటి రెండు చిత్రాల్లో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment