సాక్షి, హైదరాబాద్/ సాక్షి, నెట్‌వర్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అధికార టీఆర్‌ఎస్ పెద్దయెత్తున నిరసన వ్యక్తం చేసింది. మంగళవారం నాడే మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పార్టీ నేతలు బుధవారం రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. దీంతో హైదరాబాద్ నగరంతో సహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలు ప్రదర్శిస్తూ ఆందోళనలు చేపట్టాయి.
పలుచోట్ల బైక్ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. మోదీ, బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు మరో ఒకరిద్దరు మినహా మిగతా మంత్రులందరూ బుధవారం వివిధ రూపాల్లో జరిగిన నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. తెలంగాణ విభజన రా జ్యాంగ బద్ధంగా జరిగినా, ఎనిమిదేళ్లుగా హామీలు నెరవేర్చకుండా రాజ్యసభ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విషం కక్కారని టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలోని అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు సమ్మతించిన తర్వాతే కాంగ్రెస్, బీజేపీ అనివార్య పరిస్థితుల్లో చివరి నిమిషంలో తెలంగాణ ఏర్పాటుకు సమ్మతించిన విషయాన్ని గుర్తు చేశారు. మోదీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పేంత వరకు బీజేపీ నేతలను అడ్డుకుంటామని ప్రకటించారు. మోదీ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ తదితర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గాంధీ విగ్రహం వద్ద ఎంపీల నిరసన
ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్‌ఎస్ పీపీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావుతో పాటు పలువురు ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రధాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గన్‌పార్క్ వరకు బైక్ ర్యాలీ: హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరుల స్తూపానికి నివాళుర్పించారు. మోదీ వ్యాఖ్యల వెనుక మళ్లీ ఉమ్మడి ఏపీ ఏర్పాటు ప్రయత్నం ఉందనే అనుమానాన్ని తలసాని వ్యక్తం చేశారు. కాగా ఉస్మానియా యూనివర్సిటీలో టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
న్యాయవాదుల నిరసన: టీఆర్‌ఎస్ లీగల్ సెల్ నాయకులు కళ్యాణ్‌రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు హైకోర్టు వరకు ర్యాలీ నిర్వహించి ధర్నాకు దిగారు. తన రాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారనే అక్కసుతోనే మోదీ తెలంగాణపై విషం చిమ్ముతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ములుగులో విమర్శించారు. కరీంనగర్‌లో మార్క్‌ఫెడ్ మైదానం నుంచి తెలంగాణ చౌక్ వరకు మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మళ్లీ తెలంగాణను, ఏపీని కలపాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా ఆరోపించారు. తెలంగాణ చౌక్‌లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ప్రధాని దిష్టిబొమ్మ ఎత్తుకెళ్లిన బీజేపీ నేతలు
నల్లగొండలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు టీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నించారు. క్లాటవర్ సెంటర్‌కు తీసుకొచ్చిన దిష్టిబొమ్మకు ప్రధాని ధరించే సూటు, రుమాలు, కాషాయ కండువా, బీజేపీ జెండాను కప్పారు. ఇంతలో అక్కడకు వచ్చిన బీజేపీ నాయకులు సూటు, పార్టీ జెండా లేకుండా దిష్టిబొమ్మను దహనం చేసుకోవాలని చెప్పారు. సూటు, కాషాయ కండువా, రుమాలు తీసుకొని వెళ్లిపోయారు. ఈ విషయం టీఆర్‌ఎస్ కార్యకర్తలు తమ నాయకులకు చెప్పడంతో వారు మరో దిష్టిబొమ్మను సిద్ధం చేసి తీసుకొచ్చారు. అయితే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మరోసారి దిష్టిబొమ్మను తీసుకుని వెళ్లిపోయారు. దీంతో మరో దిష్టిబొమ్మను తీసుకొచ్చిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో దహనం చేసి నిరసన తెలిపారు.
జిల్లాల్లో నిరసనలు ఇలా...: మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రీనివాసకాలనీ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వనపర్తిలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో జరిగిన ధర్నా కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మం జిల్లా కేంద్రంలో పువ్వాడ అజయ్ నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహించారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుండడాన్ని ప్రధాని మోదీ ఓర్వలేకపోతున్నారని మంత్రి అజయ్ విమర్శించారు. మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు వేర్వేరు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో ప్రధాని వైఖరిపై మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మోదీ వ్యాఖ్యలపై బాల్క సుమన్ నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు వేదికగా మోదీ క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్ ఎన్నారై గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల డిమాండ్ చేశారు.
ర్యాలీని అడ్డుకున్న బీజేపీ
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అయితే జనగామ జిల్లా కేంద్రంలో తలపెట్టిన బైక్‌ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక ఆర్టీసీ చౌరస్తాలో మొదట కాంగ్రెస్ నాయకులు మోదీ చిత్రపటాలతో నిరసన తెలుపుతుండగా.. బీజేపీ, బీజేవైఎం నాయకులు అడ్డుకున్నారు.
ఇరువర్గాల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ నెహ్రూ పార్కు వరకు వెళ్లి.. ఆర్టీసీ చౌరస్తాకు చేరుకుంది. పీఎం డౌన్‌డౌన్ అని నినదిస్తూ టీఆర్‌ఎస్ శ్రేణులు వెళ్తుండగా బీజేపీ, బీజేవైఎం నాయకులు వారిని కూడా అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. చేతిలో ఉన్న జెండా కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన సుమారు 10 మంది నాయకులు, కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగడంతో గొవడ సద్దుమణిగింది. రెండు పార్టీల బాధ్యులు పోలీస్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment