Hyderabad: TSRTC To Launch Electric AC Buses E-Garuda - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు

Published Tue, May 16 2023 8:30 AM | Last Updated on Tue, May 16 2023 2:45 PM

Hyderabad To Vijayawada E-Garuda Electric Bus Services - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ‘ఈ–గరుడ’ పేరుతో నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున ఈ బస్సులను నడపనున్నా­రు. మొదటి విడతగా 10 బస్సులను ప్రారంభించనున్నారు.

హైదరాబాద్‌లో­ని మియాపూర్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలోని పుష్పక్‌ బస్‌ పాయింట్‌ వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలోరవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ జెండా ఊపి ఈ బస్సులను లాంఛనంగా ప్రారంభిస్తారు. టీఎస్‌ఆరీ్టసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మిగతా 40 బస్సులను ఈ ఏడాది చివరినాటికి దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

ఈ–గరుడ బస్సుల ప్రత్యేకతలివీ..
👉కొత్తగా ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు 12 మీటర్ల పొడవు ఉంటాయి. 41 సీట్లు ఉంటాయి. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 325 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. 
👉 ప్రతి సీటు వద్ద మొబైల్‌ చార్జింగ్‌ సౌకర్యంతోపాటు రీడిండ్‌ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు. 
👉 ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహి­కిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతోపాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ ఉంటుంది. వాటిని టీఎస్‌ఆరీ్టసీ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేస్తారు. 
👉 ప్రతి బస్సులో మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది. 
👉 బస్సులోని ప్రయాణికులను లెక్కించే ఆటోమేటిక్‌ ప్యాసింజర్‌ కౌంటర్‌ (ఏపీసీ) కెమెరా కూడా ఉంది. 
👉 బస్సును రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. 
👉 బస్సుకు ముందు, వెనుక ఎల్‌ఈడీ బోర్డులు ఉంటాయి. వాటిలో గమ్యస్థానాల వివరాలను ప్రదర్శిస్తారు. 
👉 అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఈ బస్సుల్లో ‘ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం (ఎఫ్‌డీఎస్‌ఎస్‌)’ను ఏర్పాటు చేశారు.
👉 ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా బస్సుల్లో పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ కూడా ఉంది. 

త్వరలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు
గ్రేటర్‌ హైదరాబాద్‌లో పరుగులు తీసేందుకు త్వరలోనే 10 ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫ్లైఓవర్లు, మెట్రో మార్గాలు లేని రూట్లలో వీటిని నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక రానున్న రెండేళ్లలో ఆర్టీసీలో మొత్తంగా 1,860 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 1,300 బస్సులను హైదరాబాద్‌లో నడుపుతారు. మరో 550 బస్సులను హైదరాబాద్‌ నుంచి వివిధ జిల్లాలకు తిప్పనున్నారు.
చదవండి: 16 బోగీలతో సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌.. ఎప్పటి నుంచి అంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement