సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు.. ప్రతి ఒక్కరిలో ఏదో నూతన ఉత్సాహం. పాత సంవత్సరంలోని అనుభవాలకు వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాది మరిన్ని ఆనందాలకు వేదికవ్వాలని న్యూ ఇయర్ వేడుకలతో ఆహ్వానిస్తుంటాం. కానీ ప్రస్తుత పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. చాపకింద నీరులా వ్యాప్తిస్తున్న ఒమిక్రాన్ ఓ వైపు.. నిర్లక్ష్యం కారణంగా గడిచిన రెండు సంవత్సరాల కాలంలో పెనవేసుకున్న విషాద అనుభవాలు మరో వైపు.. ఈ తరుణంలో ఓపెన్ పార్టీలకు అధికారికంగా వెసులుబాటు లభించినప్పటికీ., పార్టీ అంటే పబ్‌లేనా? అంటున్నారు కొందరు యువకులు. పాశ్చాత్య పార్టీలకు భిన్నంగా సరి‘కొత్త’గా స్వాగతిస్తామంటున్నారు.
ఇదే మా న్యూ ఇయర్ రిజల్యూషన్..
► ఈ రెండేళ్ల కాలంలో మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కాదు. కరోనాకు ముందు ఆ తర్వాత అనేలా అనడంలో అతిశయోక్తి లేదేమో. విద్య, ఉద్యోగం, వైద్యం, ఆహారం, అలవాట్లు ఇలా అన్నింటిలో మార్పులు ఆమోదించినప్పుడు ఈ పార్టీలకెందుకు మినహాయింపు అంటోంది ఈతరం యువత.
► మంచో చెడో కోవిడ్ వల్ల కుటుంబానికి కాççస్త సమయాన్ని కేటాయించడం అలవాటైంది. ఈసారి 31 వేడుకలు ఫ్యామిలీతోనే అంటున్నారు. జనసంద్రంలా నిండే గోవా బీచ్‌లు, రిసార్ట్‌లు కాదు పరిమిత మిత్రులతో ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకుంటున్నామని మరికొందరు చెబుతున్నారు.
► ఒమిక్రాన్ ఒక్కటే కారణం కాదు, గత రెండు, మూడు నెలలుగా జరిగిన ప్రమాదాల్లో అధిక శాతం డ్రంకన్ డ్రైవ్‌వే కావడం విదితమే. ఇలాంటి పరిస్థితుల్లో సరికొత్త ట్రెండ్‌తో న్యూ ఇయర్ వేడుకలు జరపడమే మా రిజల్యూషన్ అంటోంది ఈతరం. (చదవండి: Happy New Year 2022 Wishes)
ఓడితేనే గెలుస్తాం..
కొత్త సంవత్సరం అంటేనే కొత్తగా ఉండాలి. పాత పద్ధతులెందుకు? పార్టీ కల్చర్ అంటే నాకు ఇష్టమే, కానీ అది సామాజికంగా నష్టం కలిగించేదిగా ఉండకూడదు. ఇప్పుడున్న పరిస్థితులు మనకు పరీక్షలాంటివే. కొన్ని సంతోషాలను వద్దనుకుని ఓడిపోతేనే మనం గెలుస్తాం. ఈ సిటీ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికీ వెళ్లదు. మంచి రోజులు వచ్చాక మరింత గ్రాండ్‌గా పార్టీ చేసుకుందాం. ఈసారి కొద్ది మంది మి త్రులతో ఇంటి దగ్గరే కేక్ పార్టీ ప్లాన్ చేసుకున్నాం.
– సంతోష్, ఫ్యాషన్ ఔత్సాహికుడు
స్టే హోం.. స్టే సేఫ్..
సంతోషాన్ని పంచుకోవడానికి జరుపుకొనేవే పార్టీలైనా, పండగలైనా. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీల పేరుతో జనసమూహాలుగా చేరడం శ్రేయస్కరం కాదు. గత కొంత కాలంగా జన సంచారం పెరిగింది, వేడుకలూ జరుపుకొంటున్నారు. అన్నీ సర్దుకుంటున్న సమయంలో ఎంటర్‌టైన్మెంట్ పేరుతో విపత్కర పరిస్థితులను కోరుకోవద్దు. కుటుంబంతో జరుపుకొంటే సంబరం కూడా సంతోషపడుతుంది.
– అను, సినీనటి
సొంతూరుకు పోతాం..
స్నేహితులతో కలిసి డిసెంబర్ 31ని గోవాలాంటి ఇతర ప్రదేశాల్లో సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఒమిక్రాన్ రూపంలో పెను ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈసారి సొంతూరి వెళుతున్నాం. ప్రకృతి ఒడిలో, ఊరి అందాల చెంతన గడిపే ప్రతి క్షణమూ తీయని వేడుకే కదా.
– రామ్, క్యూఏ
Comments
Please login to add a commentAdd a comment