హైదరాబాద్, సాక్షి: హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా వల్లే ఓ మహిళ బలవనర్మణానికి పాల్పడిందన్న కథనాల నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. అయితే హైడ్రా గురించి ఉద్దేశపూర్వకంగానే కొందరు.. కొన్ని వీడియోలతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. పేద, మధ్య తరగతులను భయాందోళనలకు గురి చేస్తున్నారని అన్నారాయన.
‘‘హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. బుచ్చమ్మ ఆత్మహత్యపై కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడాను. శివయ్య దంపతుల కూతుర్లుకు రాసిచ్చిన ఇల్లు.. కూకట్‌పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ ఎఫ్‌టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయి. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో వారి కూతుర్లు బుచ్చమ్మను ప్రశ్నించారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. బుచ్చమ్మ సూసైడ్‌తో హైడ్రాకు సంబంధం లేదు. హైడ్రా గురించి మీడియాలో గానీ, సామాజిక మాధ్యమాల్లోగానీ భయాలు పుట్టించవద్దని కోరుతున్నాను.
సంబంధిత వార్త: హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య!
.. రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతలను హైడ్రాకు ఆపాదిస్తున్నారు. కూల్చివేతలకు సంబంధించి మూసీ పరిధిలో చేపట్టిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదు. మూసి నదిలో శనివారం భారీగా ఇళ్లను కూల్చివేయబోతున్నట్లు నకిలీ వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రత్యేక ఎజెండాతో హైడ్రాపై అవాస్తవ, నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయాన్ని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
.. హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దు. పేదలు, మధ్యతరగతి ప్రజలు కూల్చివేతల వల్ల ఇబ్బందులు పడవద్దని, దీనికి సంబంధించి ప్రభుత్వం కచ్చితమైన సూచనలు జారీ చేసింది’’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment