సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిన వర్షాలు దంచికొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, కామార్డె జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. మంగళవారం నుంచి గురువారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాతో పాటు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక, నేడు అత్యధికంగా మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 9 సెంటీమీటర్లకుపైగా వర్షాపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: పొంగులేటి అందుకే కాంగ్రెస్‌లో చేరారా?
Comments
Please login to add a commentAdd a comment