సాక్షి, హైదరాబాద్: కాస్త ఒళ్లు వెచ్చబడితే వెంటనే ఇంట్లో తెచ్చిపెట్టుకున్న పారాసిటమాల్ మాత్ర వేసుకుంటాం.. గొంతునొప్పి రాగానే మెడికల్ షాపుకెళ్లి అజిత్రోమైసిన్ అడుగుతాం.. ఒళ్లు నొప్పులకు ఐబూప్రోఫిన్ మాత్ర మింగేస్తాం.. ఇలా సాధారణ రోగాలకు మనలో చాలామంది వైద్యుడిని సంప్రదించకుండానే సొంత చికిత్స తీసుకుంటుంటారు.
అయితే ఇది ప్రమాదకరమని, ఎలాంటి మందులనైనా డాక్టర్ సలహాతోనే వాడాలని ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ సూచించింది. ఇష్టారాజ్యంగా మందులను వేసుకుంటే శరీరంలో తీవ్రమైన దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించింది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చని తెలిపింది. ముఖ్యంగా 213 ఔషధాల వాడకం వల్ల కొందరిలో ఈ తరహా సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చంటూ ఆ జాబితాను విడుదల చేసింది.
పరిశోధనల తర్వాత..
వివిధ కంపెనీలు పరిశోధనలు, అనుమతులు పొందాక తయారుచేసి విక్రయించే మందులను రోగులు వాడాక కొందరిలో సైడ్‌ఎఫెక్ట్స్ కనిపించొచ్చు. దీనిపై అందే ఫిర్యాదుల ఆధారంగా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ఈ విషయాన్ని ఫార్మకాలజీ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేస్తాయి. ఆయా సైడ్ ఎఫెక్ట్స్‌పై ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ పరిశోధనలు చేసింది.
గుర్తించిన అదనపు సైడ్‌ఎఫెక్ట్స్ సమాచారాన్ని ప్రజలకు, డాక్టర్లకు అందుబాటులో ఉంచాలని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు సిఫార్సు చేసింది. ఆ ప్రకారం కంపెనీలకు సమాచారమివ్వాలని కోరింది. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చర్యలు తీసుకురావాలని కోరింది. 2014 నుంచి 2020 వరకు సైడ్ ఎఫెక్ట్స్ వెలుగుచూసిన 213 రకాల మందుల జాబితాను ఇండియన్ ఫార్మకోఫియా కమిషన్ విడుదల చేసింది.
వాటిల్లో కొన్నింటి వివరాలు..
►పైపరాసిలిన్ కజోబ్యాక్టిమ్ ఇంజెక్షన్: తీవ్రమైన ఇన్ఫెక్షన్ కోసం వాడే యాంటిబయాటిక్ ఇది. దీనివల్ల కొందరిలో శ్వాస సమస్య, ఎముకల బలహీనత, పోటాషియం లోపం వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు.
►మ్యానిటాల్ ఇంజెక్షన్: తలకు దెబ్బ తగిలినప్పుడు, ఇన్ఫెక్షన్ వచ్చి మెదడులో నీరు చేరినపుడు దీన్ని వాడతారు. దీనివల్ల పొటాషియం లోపం వంటి సైడ్‌ఎఫెక్ట్స్ రావొచ్చు.
►రేబిస్ వ్యాక్సిన్: దీనివల్ల ఒక్కోసారి శరీరం మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
►ర్యాంటిడిన్: సాధారణంగా ఎసిడిటీకి వాడ తారు. దీనివల్ల కొందరిలో సడన్‌గా గుండె ఆగి పోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా వైద్యుడి సలహా మేరకు మరేదైనా మందు వాడాలి.
►సెఫ్ట్రాక్జోమ్: దీన్ని సాధారణ జలుబు వంటి ఇన్ఫెక్షన్లకు, విరేచనాలకు, చిన్నచిన్న గడ్డలకు కూడా వాడతారు. దీనివల్ల కొందరిలో శరీరమంతా రి యాక్షన్ రావొచ్చు. అది ఒక్కోసారి ప్రాణాంత కం కావొచ్చు. కొందరిలో చర్మం ఊడిపోతుంది.
►అజిత్రోమైసిన్: యాంటీబయోటిక్. జలుబుకు ఎక్కువగా వాడతారు. దీనివల్ల కొందరిలో శరీర మంతా చిన్నచిన్న చీము కురుపులు వస్తాయి.
►బ్రూఫెన్: దీన్ని మధ్యస్థాయి నొప్పులు తగ్గించేందుకు వాడతారు. దీనివల్ల కొందరిలో శరీరమంతా రియాక్షన్ రావొచ్చు. చర్మం లేచిపోతుంది.
►అమాక్సిలిన్ క్లలానిక్ యాసిడ్ ట్యాబ్లెట్: జలుబు వంటి వాటికి వాడే యాంటీబయోటిక్ ఇది. కొందరిలో శరీరమంతా రియాక్షన్ రావొచ్చు.
►సిప్రోఫ్లాక్సిన్: దీన్ని తేలికపాటి చర్మ ఇన్ఫెక్షన్లకు, చీముగడ్డల తగ్గుదలకు వాడతారు. కొందరిలో శరీరమంతా రియాక్షన్ వచ్చే అవకాశముంది.
►యామ్లో డెఫిన్: బీపీని తగ్గించే మందు ఇది. దీన్ని వాడటం వల్ల కొందరిలో వెంట్రుకలు ఊడిపోతాయి. చిగుళ్లు పెరుగుతాయి.
►సెఫిక్జిమ్: యాంటీబయోటిక్. తేలికపాటి గొంతు, శ్వాసకోశ సమస్యలు, ఉదర ఇన్ఫెక్షన్లకు వా డతారు. కొందరికి నోట్లో అల్సర్లు ఏర్పడతాయి.
►ఓఫ్లాక్సిన్: విరేచనాలు తగ్గేందుకు వాడతారు. కొందరిలో శరీరమంతా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కొందరిలో ప్రాణాంతకమైన రియాక్షన్లు రావొచ్చు.
►ట్రెమడాల్: నొప్పి తగ్గేందుకు వాడే మాత్ర. దీనివల్ల కొందరిలో వెక్కిళ్లు వస్తాయి. ఒక్కోసారి మూత్రం ఆగిపోవచ్చు.
►గ్లిబెంక్లమైడ్: షుగర్ తగ్గించేందుకు వాడతారు. దీన్ని వల్ల కొందరిలో గుండెదడ వస్తుంది.
►ప్యాంటొప్రజోల్: దీన్ని ఎసిడిటీకి వాడతారు. దీన్ని వాడటం వల్ల కొందరిలో కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి.
►జింక్: బలానికి వాడే ఈ టాబ్లెట్ వల్ల కొందరిలో విరేచనాలు రావొచ్చు.
►పారాసిటమాల్: జ్వరానికి వాడతారు. దీనివల్ల కొందరిలో చర్మంపై చిన్నచిన్న కురుపులు వస్తాయి.
►లోసార్టాన్: బీపీని తగ్గించే ఈ మందు వాడకం వల్ల కొందరిలో కండరాలు పట్టుకుంటాయి. అతిగా పనిచేస్తే ఎలా నొప్పులు వస్తాయో దీనివల్ల అలాగే జరుగుతుంది.
►రెమిడిసివీర్: కరోనా, ఎబోలా వైరస్ కట్టడికి వాడతారు. దీనివల్ల కొందరిలో గుండె వేగం తగ్గుతుంది.
►ఎటినెలాల్: బీపీ తగ్గించే మందు. దీన్ని వాడటం వల్ల కొందరిలో చర్మానికి ఇన్ఫెక్షన్ వస్తుంది.
►యాంబ్రాక్సాల్: దగ్గు తగ్గించేందుకు వాడతారు. దీనివల్ల కొందరిలో కన్నీళ్లు వస్తాయి.
►డెకడ్రాన్: ఆస్తమాలో, ఇన్ఫెక్షన్లకు వాడతారు. దీనివల్ల కొందరిలో వెక్కిళ్లు వస్తాయి.
►అమాక్సిలిన్: తేలికపాటి యాంటీబయోటిక్ ఇది. దీనివల్ల కొందరిలో కళ్లమంటలాంటిది వస్తుంది.
►ఎమిట్రిప్లిన్: తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌కు వాడతారు. దీర్ఘకాలిక నొప్పులకు ఉపయోగిస్తారు. దీనివల్ల కొందరిలో చిగుళ్ల రంగు మారుతుంది.
►సెఫ్ట్రాజోమ్: ఆసుపత్రుల్లో చేరినవారికి సర్జరీకి ముందు వాడే యాంటీబయోటిక్. దీనివల్ల కొందరిలో గుండెదడ వస్తుంది.
►టెల్మాసార్టాన్: బీపీకి వాడతారు. దీంతో కొందరిలో చర్మ సంబంధ రియాక్షన్లు వస్తాయి. కొందరిలో ముఖం నల్లబడుతుంది.
►అటర్వస్టాటిన్: దీన్ని చెడు కొవ్వు తగ్గించేందుకు వాడతారు. దీనివల్ల కొందరిలో విటమిన్–డి కొరత ఏర్పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment