రొమేనియా సరిహద్దు దగ్గర భారీగా విద్యార్థులు, జనం
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి రొమేనియా, హంగేరీ దేశాలకు చేరుకున్న వారిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో ముంబై, ఢిల్లీలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బస్సులు, కార్లలో రొమేనియాకు చేరుకున్న వాళ్లు సరిహద్దు తనిఖీల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని, మన దేశానికి చెందిన ఎంబసీ అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు నగరానికి చెందిన పలువురు వైద్య విద్యార్థులు ‘సాక్షి’తో చెప్పారు.
హైదరాబాద్‌కు చెందిన ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న కొచ్చెర్ల భరత్, రాము, సాన్విక, తదితరులు శనివారం సాయంత్రం వినీతియా సిటీ నుంచి బస్సులో బయలుదేరారు. ఆ బస్సు రొమేనియాకు 10 కిలోమీటర్ల దూరంలో వారిని వదిలి వెళ్లిపోయింది. శనివారం రాత్రంతా చలిలో గజగజ వణుకుతూ అక్కడ ఉన్న బంకర్లలో తలదాచుకున్నారు. ఆదివారం ఉదయం కాలినడకన రుమేనియాకు బయలుదేరినట్లు ఈసీఐఎల్‌కు చెందిన భరత్ చెప్పాడు.
రొమేనియాకు భారీగా జనం
భారత విద్యార్థులతో పాటు ఉక్రెయిన్ ప్రజలూ భా రీగా రొమేనియాకు చేరుకోవడంతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు సరిహద్దు తనిఖీలు పూర్తవలేదు. ఆదివారం ఉదయం నుంచి మధ్యా హ్నం వరకే సుమారు 5 వేల మంది అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఆహారం, తాగునీటి సమస్య తలెత్తింది. 2 రోజులుగా సరైన నిద్ర, ఆహారం లేకుండా గడుపుతున్నామని, ఆదివారం పగలంతా సరైన ఆహారం లేక బిస్కెట్లతో గడిపామని భరత్ చెప్పాడు.
బృందంలోని కొందరు అమ్మాయిలు లగేజీ మోయలేక ఇబ్బంది పడ్డారన్నా డు. ఎంబసీ అధికారులు స్పందించడం లేదని, వాట్సప్‌లలో మెస్సేజ్‌లు మాత్రం ఇస్తున్నారన్నా డు. సరిహద్దు వద్ద తనిఖీలు పూర్తి చేసుకొని ఎయిర్‌పోర్టుకు చేరుకోవడానికి మరో రోజు పట్టవచ్చేమో నని, అటు నుంచి ఇండియాకు వచ్చేందుకు ఎంత సమయం పడుతుందోనని అన్నాడు. తమ కుమారుడి నుంచి సమాచారం అందుతున్నా అక్కడ ఇబ్బందులు చూస్తే గుండె తరుక్కుపోతోందని భరత్ తండ్రి సత్యం ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు 39 మంది రాక
శనివారం రాత్రి 8 నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు 4 విమానాల ద్వారా 39 మంది తెలంగాణ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి చేరుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రుమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ముంబైకి వచ్చిన విమానంలో 14 మంది, ఢిల్లీకి వచ్చిన మరో విమానంలో 16 మంది, హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి ఢిల్లీకి వచ్చిన 2 విమానాల్లో 9 మంది రాష్ట్రానికి వచ్చారు. వీరి ని రాష్ట్ర సర్కారు హైదరాబాద్ తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment