ఒక్కో పాఠశాల 20 నుంచి 25 ఎకరాల్లో ఏర్పాటు: భట్టి
రాయదుర్గం: రాష్ట్రంలో ప్రతీ మండలంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఒక్కో పాఠశాలను 20 నుంచి 25 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు దీటుగా వీటిని అందుబాటులోకి తెస్తామని, వీటి ఏర్పాటుకు ఇప్పటికే బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించామని చెప్పారు.
శనివారం ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని శేరిలింగంపల్లిలోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను సందర్శించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ‘మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు. వారి ఆశలను తీర్చేందుకు ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వం మీపై పెట్టుకున్న కలలను నిజం చేయడానికి కష్టపడి చదువుకొని మీ లక్ష్యాలను సాధించండి’అని చెప్పారు.
విద్యా, వైద్య రంగాల్లో సమూల ప్రక్షాళన
విద్యా, వైద్యరంగాల్లో సమూల ప్రక్షాళన చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రజల సమస్యలను ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం గాలికి వదిలేయదన్నారు. సంక్షేమం, విద్యకు బడ్జెట్ సమస్య కాదని, ఎన్ని నిధులైనా వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆడంబరాలకు పోయే నాయకులకు భిన్నంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరాడంబరంగా విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకోవడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి, సహకార్యదర్శి సక్రూనాయక్, రీజినల్ కోఆర్డినేటర్ శారద పాల్గొన్నారు.
ఘనంగా భట్టి జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన జన్మదినం సందర్భంగా శనివారం ఉదయం నుంచే పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజాభవన్‌కు తరలివచ్చారు. పోచమ్మ తల్లి ఆలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సతీమణి నందినితో కలిసి అభిమానుల సమక్షంలో 50 కేజీల కేక్‌ను కట్ చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌తోపాటు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ ఉద్యోగులు కేక్ కట్ చేయించి భట్టికి శుభాకాంక్షలు తెలియజేశారు. గాంధీభవన్‌లోనూ పార్టీ నేతలు కేక్ కట్ చేసి భట్టి జన్మదిన వేడుకలను నిర్వహించారు.
రేవంత్ శుభాకాంక్షలు
ఉప ముఖ్యమంత్రి భట్టికి సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ‘భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను, ప్రజలకు మరింత సేవచేసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment