సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని రాజకీయ పార్టీల్లో వీటిపై ఆసక్తి నెలకొంది. మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. కొన్ని జిల్లాల్లో రెండేసి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. చాలామంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగనున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో రాజకీయ పరిణామాలపై ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తున్నట్లు తెలిసింది.
ఆరుగురి వెనుక అధికారపార్టీ నేతలు!
రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కొద్ది రోజులుగా హాట్ టాపిగ్గా మారింది. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జిల్లాలో స్థానిక సంస్థల కోటా నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతుండటంతో అందరి దృష్టీ ఆ జిల్లాపైనే ఉంది. దీనికి తగ్గట్టుగా స్వతంత్ర అభ్య ర్థులు 9 మంది నామినేషన్లు దాఖలు చేయడంతో మరింత ఆసక్తికరంగా మారింది. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా మిగిలిన అభ్యర్థులు అధికార పార్టీకి చెందినవారేనని ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నతాధికారులకు నివేదించాయి.
పైగా ఒక్కో అభ్యర్థికి 10 మంది ప్రతిపాదకులు సంతకాలు చేయడం గమనార్హమని నిఘా వర్గాల అధికారులు తెలిపారు. 9 మంది అభ్యర్థులను 90 మంది ప్రతిపాదించడం అంటే క్యాంపు రాజకీయాలకు తెరదీసినట్టేనని ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. కాంగ్రెస్‌గా భావిస్తున్నవారిని మినహాయిస్తే, మిగతా ఆరుగురి వెనుక ఎవరున్నారన్న దానిపై ఆరా తీసింది. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న నేతలే ఇలా స్వతంత్రుల ద్వారా నామినేషన్లు వేసి, అవసరమైన పక్షంలో తమ సత్తా చూపించాలని భావిస్తున్నట్టు తెలిపింది.
క్యాంపు రాజకీయాలపై కన్ను
కరీంనగర్‌లో విపక్ష నేతలంతా ఒక్కటైనట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అధికార పార్టీ అసంతృప్త నేతలను సైతం తమతో కలుపుకొని క్యాంపు రాజకీయాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు గుర్తించాయి. 1,326 ఓట్లు ఉన్న కరీంనగర్ లో 350 నుంచి 400 మందిని ఓ కీలక నేత ద్వారా గోవాలోని క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మహబూబ్‌నగర్, రంగారెడ్డిపై...
గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి.. 2007లో మహబూబ్‌నగర్ జిల్లా నుంచే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండటంతో ఈ జిల్లాపై ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డితో పాటు అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు తెలిసింది.
రంగారెడ్డి జిల్లాలోనూ అధికార పార్టీకి చెందిన అసంతృప్తులే నామినేషన్లు వేస్తారని ఇంటెలిజెన్స్ భావిస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించి, తర్వాత అధికార పార్టీలో చేరిన వారిని స్వతంత్రులుగా బరిలోకి దించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారన్న సమాచారాన్ని కూడా ఇంటె లిజెన్స్ గుర్తించింది. అయితే ఈ రెండు జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment