సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మంత్రి కేటీఆర్ అప్యాయంగా పలకరించారు. ఈటల సీటు వద్దకు వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు. నేతలు ఒకరినొకరు హత్తుకున్నారు. దాదాపు పది నిమిషాలపాటు మాట్లాడుకున్నారు.
అదే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డీతోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. పలు అభివృద్ది పనుల కోసం కేటీఆర్ చాంబర్‌లో మంత్రికి సంగారెడ్డి ఎమ్మెల్యే వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. జగ్గారెడ్డిని చూడగానే పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లా అన్న అంటూ కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. అప్పటికే జగ్గారెడ్డితో టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఉండగా.. మీ ఇద్దరి దోస్తాన్ ఎక్కడ కుదిరిందని కేటీఆర్ అడిగారు.
మాది ఒకే మంచం, ఒకే కంచం అంటూ మామిళ్ల బదులివ్వగా.. అయితే జగ్గారెడ్డిని గెలిపిస్తవా అని కేటీఆర్ ప్రశ్నించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తానని.. మన దగ్గరకు (బీఆర్‌ఎస్‌లోకి) పట్టుకొస్తానని మామిళ్ల రాజేందర్ నవ్వుతూ చెప్పారు. ఈ సంభాషణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
చదవండి: 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ మీటింగ్‌లో నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment