శిశువుతో సీపీ తరుణ్ జోషి(ఫైల్)
‘ఆకలైనప్పుడల్లా పాలు తాగాను. నువ్విచ్చే ముద్దులతో మురిసిపోయాను. నీ ఒడిలో ఆడుకున్నాను. నీ వెచ్చని స్పర్శతో హాయిగా నిద్రపోయాను. ఏమైందో తెలియదు గానీ.. వీళ్లెవరో నన్నెత్తుకొచ్చారు. అంగట్లో బొమ్మలా.. నన్ను వేరొకరికి అమ్మారు. నాకేదో ప్రాణాంతక వ్యాధి ఉందని డాక్టర్లు చెప్పడంతో.. తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు నాకే తెలియని లోకమైన శిశుగృహలో ఉన్నాను. నీ ఒడి చేరాలనుంది. నీ చనుబాలు తాగాలనుంది.’ అని ఆ శిశువుల ఆక్రందనలు వింటే అర్థమవుతోంది. తల్లికి దూరమైన ఇద్దరు శిశువులు గుక్క పట్టి ఏడుస్తున్నారు.
– సాక్షి, వరంగల్
ఓరుగల్లు కేంద్రంగా అంతర్రాష్ట అక్రమ రవాణా ముఠా సభ్యులు శిశువులను విక్రయిస్తున్నారని ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు. శిశువులను సంరక్షించారు. నెలల వయసు లేని ఆ పసిబిడ్డలు ఆక్రందనలు చేస్తున్నా.. తల్లుల ఆచూకీ ఇంకా దొరక్కపోవడం విచారకరం. గత నెల 14న శిశువుల విక్రయ ముఠాను పట్టుకున్నా.. ఇప్పటివరకు ఆ శిశువుల తల్లులెవరో తెలుసుకునే దిశగా ఇంతేజార్‌గంజ్ పోలీసులు అడుగు ముందుకేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఈ కేసులో వరంగల్ వాసులు రుద్రారపు స్వరూప, ఓదెల అనిత, విజయవాడ వాసి శారదతోపాటు గుజరాత్, మహారాష్ట్రకు చెందిన అనురాధ అక్షయ్ కోరి, సల్మా యూనిస్ షేక్ అలియాస్ హారతి, పాట్నీ శైలబేన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించి ఆ శిశువులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసుకొని వారి వద్దకు చేర్చాల్సి ఉంది. కానీ పోలీసులు ఆ కేసును పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ శిశువులను గుజరాత్, మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చామని పట్టుబడిన నిందితులు చెప్పినప్పటికీ పోలీసులు ఆ దిశగా విచారణ చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని ప లువురు విమర్శిస్తున్నారు.
తీగ లాగితే.. డొంక కదులుద్ది!
వరంగల్ కేంద్రంగా అంతర్రాష్ట అక్రమ రవాణా ముఠా కదలికలున్నాయని పోలీసులకు ఈ అరెస్టుతో తెలిసినా.. వాటి మూలాలను వెలికితీసే దిశగా చొరవ చూపడం లేదు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తే ఇక్కడి లోకల్ ఏజెంట్ల గుట్టు రట్టవుతుంది. ఆశ వర్కర్ స్వరూప, స్వయం సహాయక మహిళా సంఘం లీడర్ అనితతోపాటు ఇతర రాష్ట్ర నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే.. ముఠాకు సంబంధించిన వివరాలు దొరికే అవకాశం ఉంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరిస్తే ముఠా మూలాలు, శిశువుల తల్లులు దొరికే అవకాశం ఉందని పలువురు పేర్కొటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment