సాక్షి, పెద్దపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్ రావు దంపతుల హత్యకేసు విచారణ కీలక దశకు చేరింది. హత్యకు గల కారణాలు, హంతకులు ఎవరు అనేది తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు, మరోసారి వారిని విచారించేందుకు కస్టడీ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. పోలీసుల కస్టడీలో ఉన్న బిట్టు శ్రీనును ఏ క్షణానైనా కోర్టులో హజరుపరుచనున్నారు. బిట్టు శ్రీను ఇచ్చిన కీలక సమాచారంను రుజువు చేసుకునేందుకు రిమాండ్‌లో ఉన్న ముగ్గురిని వారం రోజులు కస్టడికి ఇవ్వాలని రామగిరి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జడ్జి లేకపోవడం పిటిషన్ పెండింగ్‌లో ఉంది. మరోవైపు నిందితులకు బెయిల్ కోసం బందువులు ప్రయత్నిస్తుండగా నిందితుల పక్షాన ఎవరు వకాలత్ చేయవద్దని, మార్చి ఒకటో తేదీ వరకు విధులు బహిష్కరించాలని మంథని కోర్టు న్యాయవాదులు తీర్మానించారు.
హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు నాగమణి దంపతుల హత్య చిక్కుముడి త్వరలో వీడనుంది. హత్య కేసును హైకోర్టు సుమోటగా స్వీకరించడంతో పాటు న్యాయవాదులు నిరసన ఆందోళనలు వ్యక్తం చేస్తుండడంతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇద్దరు ఐజీలు, ఓ డిఐజి, సిపి పర్యవేక్షణలో దర్యాప్తు బృందాలు విచారణ జరుపుతున్నాయి. ఇప్పటికే కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తుంది. న్యాయవాదుల హత్యకు కారు, కత్తుల సమకూర్చిన బిట్టు శ్రీను వాగ్మూలం పైనే కేసు అంతా ఆధారపడి ఉండడంతో నాలుగు రోజులుగా పోలీసులు అతన్ని కస్టడిలో ఉంచుకుని రహస్యంగా విచారించారు. వీడియో ఎవిడెన్స్ లతో బిట్టు శ్రీను నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తుంది. ఆయన ఇచ్చిన సమాచారం ఏమేరకు సరైనదో తెలుసుకునేందుకు ఇప్పటికే అరెస్ట్రై జైలులో ఉన్న కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌లను వారం రోజుల పాటు కస్టడీ కోరుతు పోలీసులు కోర్టును ఆశ్రయించారు.
నల్లకోటును అడ్డుపెట్టుకుని..
గుంజపడుగు గ్రామస్థులతో పాటు వామన్ రావు బాదితులు ఒక్కొక్కరు బయటికి వస్తు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వామన్ రావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న న్యాయవాదులను, రాజకీయ పార్టీల నాయకులను నిలదీస్తున్నారు. దంపతుల హత్యను ఓ వైపు ఖండిస్తూనే మరోవైపు వారికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ప్రజలందరు భావిస్తున్నట్లు వామన్ రావు మంచోడుకాదన్నారు. నల్లకోటును అడ్డుపెట్టుకుని గ్రామాభివృద్దిని అడ్డుకున్నారని ఆరోపించారు. క్రిమినల్ మైండ్‌తో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ అనేక మందిని ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. గ్రామంలో బడి, గుడి, గ్రామపంచాయితీ భవన నిర్మాణాలను అడ్డుకోవడంతోపాటు 90 మందికి పించన్లు రాకుండా చేశాడని, ఏ ఉద్యోగి సరిగా పని చేయకుండా ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని హైకోర్టులో పిల్ వేసి అనేక మందికి అన్యాయం చేశాడని అలాంటి వ్యక్తికి మద్దతుగా వస్తున్నవారు వాస్తవాలను తెలుసుకుని అన్యాయానికి గురైన వారందరికి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.
పుట్టమధు పాత్రపై అనుమానం..!
మరోవైపు వామన్ రావు హత్య రాజకీయ రంగు పులుముకోవడంతో అయన కుటుంబాన్ని పరామర్శల వెల్లువ కొనసాగుతుంది. హత్యకు పాల్పడింది టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కావడంతో న్యాయవాదులతోపాటు కాంగ్రెస్, బీజేపీ నేతలు వామన్ రావు కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇద్దరిని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. హత్య వెనుక ఎవరున్నారో బయటపెట్టి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. హత్యకు కారు, కత్తుల సమకూర్చిన బిట్టు శ్రీను జడ్పీ చైర్మెన్ పుట్ట మధు మేనల్లుడు కావడంతో హత్యకు రాజకీయంగా ప్రాధాన్యత పెరిగింది. మధు ఆత్మలా వ్యవహరించే బిట్టు శ్రీను గుంజపడుగుకు చెందిన కుంట శ్రీనివాస్‌తో హత్య చేయించాడా, లేక మేనమామ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. అందులో బాగంగానే బిట్టు శ్రీనును నాలుగురోజులపాటు విచారించి అతను ఇచ్చిన సమాచారంతో రిమాండ్ లో ఉన్న నిందితులను కస్టడిలోకి తీసుకుని విచారించనున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా రెండుమూడు రోజుల్లో హత్యకు గల కారణాలు, దానివెనుక ఎవరున్నారో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment