ప్రాజెక్టు నిర్మాణం అంశాన్ని సీబీఐకి అప్పగించాలని పిటిషన్లు
నాలుగు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఒక రిట్ పిటిషన్‌ను కలిపి వింటామన్న హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం.. మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లలో వాదనలను సోమవారం(ఈనెల 8న) వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లలో ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు పిటిషన్ల తరఫు న్యాయవాదులకు చెబుతూ.. విచారణను వాయిదా వేసింది. మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుకు కారకులెవరో తేల్చేందుకు.. పూర్తి అంశంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది.
‘జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును సీబీఐకి బదలాయించాలి. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.86 వేల కోట్ల సేకరణ వ్యవహారంపై కూడా సీబీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఎఓ)తో దర్యాప్తునకు ఆదేశాలివ్వాలి. మహదేవ్‌పూర్ పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తేనే కుంగుబాటుకు అసలు కారణాలు బట్టబయలవుతాయి. నవంబర్ 1న నేషనల్ డ్యాం సేఫ్టీ కౌన్సిల్ ఇచ్చిన రిపోర్టును కూడా పరిగణనలోకి తీసుకుని బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలి.
కాళేశ్వరం ప్రాజెక్టులోని ఇతర రిజర్వాయర్ల భద్రతకు వీలుగా చర్యలు చేపట్టేలా నేషనల్ డ్యాం సేఫ్టీ కౌన్సిల్ ఉత్తర్వులు ఇవ్వాలి’అని కోరుతూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, కాంగ్రెస్ నేత బక్క జడ్సన్‌తో పాటు మరో ఇద్దరు పిటిషన్లు(4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఒక రిట్ పిటిషన్) దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
ప్రభుత్వ నిర్ణయం తెలుసుకుని చెప్పండి
సీబీఐకి అప్పగించే విషయం, పిటిషనర్ల వాదనపై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకొని చెప్పాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) ఇమ్రాన్ ఖాన్ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయాన్ని ఏఏజీ.. ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పార్టీ ఇన్ పర్సన్ (అతనే వాదనలు వినిపిస్తారు)గా కేఏ పాల్ వాదిస్తూ వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. అయితే ప్రభు త్వ వాదన కూడా వినాల్సి ఉన్నందున ఉత్త ర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది.
తమ వాదనలు వినాలని పాల్, ఇతర పిటి షనర్ల లాయర్లు కోరగా ధర్మాసనం నిరాకరించింది. వ్యాజ్యాలను ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్నామంటూ విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. గతేడాది ఎన్‌డీఎస్‌ఏ అధికారులు ప్రాజెక్టును సందర్శించి మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిపోవడానికి కారణాలపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నివేదికను గత నెల విచారణ సందర్భంగా ప్రభుత్వం.. ధర్మాసనం ముందు ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment