
సాక్షి, హైదరాబాద్: జన నాట్యమండలి సీనియర్ కళాకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, గేయ రచయిత జంగు ప్రహ్లాద్ కొద్దిసేపటి క్రితం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రజా కవిగా, జన నాట్య మండలిలో చురుకైన పాత్రతో పాటు తెలంగాణా ఉద్యమంలో తన ఆట, పాటల ద్వారా కీలక పాత్రను పోషించిన ప్రహ్లాద్ మృతి కళామతల్లికి జననాట్య మండలికి, కళాకారుల లోకానికి తీరనిలోటు.
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంకు చెందిన ఆయనకు ముగ్గురు పిల్లలు. జగద్గిరిగుట్టలో ఉంటున్న ఆయనకు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రి చేరిన కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో జన నాట్య మండలి, కళామతల్లి కళాకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
సీఎం కేసీఆర్ సంతాపం..
తెలంగాణ ఉద్యమ గాయకుడు జంగ్ ప్రహ్లాద్ మరణం పట్ల ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో గాయకుడిగా ప్రహ్లాద్ చేసిన సాంస్కృతిక కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. జంగ్ ప్రహ్లాద్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment