
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామస్టేజీ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ ఓ లారీని వెనకనుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన మేడి హరీశ్ (22), హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో నివాసం ఉండే ఎం.డి.ఆసిఫ్ (22), ఎం.డి.సల్మాన్ (23)లు రామంతపూర్‌లోనే ఓ కంపెనీలో ఏసీ టెక్నీషియన్‌లుగా పనిచేస్తున్నారు. హరీశ్, ఆసిఫ్‌లు సంస్థకు చెందిన హాస్టల్‌లోనే ఉంటుండగా సల్మాన్ మాత్రం తల్లిదండ్రులతో కలసి స్థానికంగా ఉంటున్నాడు.
ఈ ముగ్గురు శుక్రవారం సాయంత్రం పిట్టంపల్లి గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకు అందరితో కలసి ఆనందంగా గడిపారు. భోజనం చేశాక ఒంటిగంట సమయంలో ముగ్గురు కలసి హైదరాబాద్‌కు పల్సర్ బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ధర్మోజిగూడెం స్టేజీ వద్ద, వే బ్రిడ్జి నుంచి గ్రానైట్ లోడ్ లారీని డ్రైవర్ రివర్స్ తీస్తూ అకస్మాత్తుగా హైవేపైకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో బైక్ నడుపుతున్న సల్మాన్, లారీ అకస్మాత్తుగా రావడంతో వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో ముగ్గురు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment