స్పీకర్ పరిధిలోని అంశాల్లో న్యాయ సమీక్ష సాధ్యం కాదు
‘అనర్హత’పై హైకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల వాదనలు
తదుపరి విచారణ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: చట్టసభలు, న్యాయస్థానాల లాంటి రాజ్యాంగ సంస్థలు తమ పరిధి దాటి ఇతర వ్యవస్థల పరిధిలో జోక్యం చేసుకోవద్దని రాజ్యాంగం పేర్కొంటోందంటూ పార్టీ ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, న్యాయశాఖ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. దేనికదే హుందాతనాన్ని పాటించాలని, స్పీకర్ పరిధిలోని అంశాల్లో న్యాయ సమీక్ష సాధ్యం కాదని పేర్కొన్నారు. స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు కొంత వీలుంటుందని అన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు నాలుగు వారాలకు గడువిస్తున్నామని.. ఆలోగా దీనికి సంబంధించిన వివరాలు అందజేయకుంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని సెప్టెంబర్ 9న స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు తేల్చిచెప్పింది.
ఈ మేరకు సింగిల్ జడ్జి ఇచ్చిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి గత నెల హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ వాదనలు వినిపించారు.
‘కైశం మేఘాచంద్ర సింగ్’లో ముగ్గురు జడ్జిల తీర్పు చెల్లదు
‘చట్టప్రకారం తహసీల్దార్ లాంటి వారి నిర్ణయానికి కూడా నెల సమయం ఉంటుంది. అలాంటిది స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి పిటిషనర్లు కనీసం ఆ సమయం కూడా ఇవ్వలేదు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్దిష్ట వ్యవధిలోగా విచారణ పూర్తి చేయాలనే ఉత్తర్వులు ఇస్తే, భవిష్యత్‌లో స్పీకర్ చట్టసభలో ఎలా నిర్ణయాలు తీసుకోవాలో కూడా కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది.
కిహోటో హోలోహన్ (1992) కేసు విచారణ సందర్భంగా ఐదుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పీకర్‌ను ట్రిబ్యునల్‌గా పేర్కొన్నందున.. ఆయన నిర్ణయాలపై సమీక్ష జరపొచ్చు. కానీ నిర్ణయం తీసుకోక ముందు కోర్టుల జోక్యం కూడదు. కైశం మేఘాచంద్ర సింగ్ (2020) కేసు విచారణ సందర్భంగా ముగ్గురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం.. స్పీకర్ ముందున్న అనర్హత పిటిషన్లపై జోక్యం చేసుకోవచ్చు అని చెప్పింది. అయితే ఐదుగురు జడ్జిల తీర్పు తర్వాత ముగ్గురు జడ్జి ఇచ్చిన తీర్పు చెల్లదు. విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పే పరిగణనలోకి తీసుకోవాలి.
సింగిల్ జడ్జి ఉత్తర్వులు కూడా స్పీకర్ పరిధిలో జోక్యం చేసుకున్నట్లే ఉన్నాయి..’అని రవీంద్ర శ్రీవాస్తవ, శ్రీరఘురాం వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, ఫిరాయింపులపై పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తరఫున జె.ప్రభాకర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున గండ్ర మోహన్‌రావు, పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి తరçఫున మయూర్‌రెడ్డి హాజరయ్యారు. తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment